అద్వితీయ నగరాలు బెజవాడ, బందరు

17 May, 2022 04:41 IST|Sakshi
విజయవాడ వ్యూ

గుర్తించిన నీతి ఆయోగ్‌ 

దేశవ్యాప్తంగా 12 నగరాలు ఎంపిక.. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే రెండు 

చారిత్రక నగరం కేటగిరీలో మచిలీపట్నం ఎంపిక 

అభివృద్ధి చెందిన నగరాల కేటగిరీలో విజయవాడ 

రేపు ఢిల్లీలో జరిగే వర్క్‌ షాప్‌నకు మేయర్లు, కమిషనర్లకు పిలుపు 

పయనమైన నగరాల ప్రతినిధులు

మచిలీపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైర్మన్‌గా వ్యవహరించే ‘నీతి ఆయోగ్‌’ దేశంలోని 7 రాష్ట్రాల్లో గల 12 నగరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. వాటిలో ఏపీ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరాలకూ చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ, వరంగల్‌ నగరాలకు చోటు దక్కింది. నగరాల అభివృద్ధికి ఏషియన్‌ డెవలెప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్‌ ముందుకొచ్చింది.

ఇందుకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించే వర్క్‌షాప్‌నకు హాజరుకావాల్సిందిగా నీతి ఆయోగ్‌ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరపాలక సంస్థల మేయర్లు, కమిషనర్లకు ఆహ్వానం అందింది. దీంతో ఇరు నగరాల ప్రతినిధులు హస్తినకు పయనమయ్యారు. నగర సర్వతోముఖాభివృద్ధికి ఏం చేయాలనే దానిపై నీతి ఆయోగ్‌ ప్రతినిధులకు సమగ్ర నివేదికలు అందించనున్నారు.
బందరు వ్యూ 

విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కీలకంగా పనిచేస్తూ, దేశంలో అత్యున్నతమైన ‘నీతి ఆయోగ్‌’ ముందు ప్రసంగించే అవకాశం దక్కటంతో నగర ప్రథమ మహిళలుగా అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని చాటేందుకు మచిలీపట్నం, విజయవాడ మేయర్లు  సిద్ధమయ్యారు. ఇక్కడ ఉన్న సహజ వనరులు, వీటి వినియోగంతో పరిశ్రమలు ఏర్పడితే యువతకు కలిగే ఉపాధి వంటి అంశాలపై వీరు ఇచ్చే ప్రజెంటేషన్‌ మేరకు భవిష్యత్‌లో రెండు నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలోని మచిలీపట్నం, విజయవాడ నగరాలకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుంది. 

చారిత్రక నగరం బందరు 
చారిత్రక నేపథ్యం గల బందరుకు దేశంలోనే రెండో మునిసిపాలిటీగా అవతరించిన ఘనత ఉంది. కానీ.. గత పాలకుల నిర్వాకంతో నగరాభివృద్ధి తిరోగమనంలో ఉంది. బందరు అభివృద్ధిపై గత పాలకులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రాశస్త్యం, ఇక్కడ గల సహజ వనరుల వినియోగం ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని భావించి ఇప్పటికే తగిన కార్యాచరణకు సిద్ధమైంది.

సముద్ర తీరప్రాంతం ఉన్నందున ఇప్పటికే రూ.348 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బందరు పోర్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రకటించి, అందుకు అనుగుణంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం నుంచి సైతం ఎగుమతులు చేసేందుకు బందరు కేంద్రం కానుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 నగరాల్లో బందరుకు చోటు కల్పించారు.

సుస్థిరాభివృద్ధిలో విజయవాడ ముందంజ
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో విజయవాడ నగరం ముందు వరుసలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు దూసుకెళుతోంది. వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న నీతి ఆయోగ్‌ ప్రతినిధులు దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విజయవాడను దేశంలోనే బ్రాండ్‌ అంబాసిడర్‌ నగరంగా గుర్తింపు పొందేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించి.. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు