ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌

10 Jun, 2021 19:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌..  గురువారం సాయంత్రం రాజీవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై సీఎం జగన్‌ చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌.. పేదలందరికి ఇళ్ల పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలు సేకరించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీతో 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయని, వీటి మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని తెలిపారు. మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు.

అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలోని ఏపీ అభివృద్ధిని రాజీవ్‌కుమార్‌ కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ‘పలు రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2020-21 సుస్థిర అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవశ్యకతను సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలను సీఎం జగన్‌ వివరించారు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

చదవండి : పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి నిధులు ఖర్చు చేస్తున్నాం

మరిన్ని వార్తలు