పర్యావరణహిత ఇంధన వినియోగం పెరగాలి: నితిన్‌ గడ్కరీ 

9 Sep, 2022 05:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని పెంచేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీర్లకు సూచించారు. ఆధునిక పరిజ్ఞానంతో జాతీయ రహదారుల నిర్మాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల సూచనలను తెలుసుకునేందుకు ’మంథన్‌’ పేరుతో బెంగళూరులో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సును గడ్కరీ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కో–ఆపరేషన్, కమ్యూనికేషన్, కో–ఆర్డినేషన్‌తో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ జాతీయ రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.  రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు