ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్‌

24 Nov, 2020 16:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘నివార్’ సైక్లోన్‌తో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివార్‌ తుపాన్‌పై జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధ వారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా  ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా  సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. 

‘నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11-20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే... వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అక్టోబరు వరకూ పడ్డ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే... చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్‌ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపండి. వీరి సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంచేసుకోండి. అలాగే కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధంచేసుకోండి.ప్రతిజిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూమ్స్‌ఉండాలి.

నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలున్నాయి. ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి.తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌ను అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచారు. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి. రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి.నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి’అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా