తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్

25 Nov, 2020 10:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ, పాండిచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాను ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారు జామున కరైకల్‌, మహాబలిపురం వద్ద నివర్‌ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది. 

నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్  కె.కన్నబాబు తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం  చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు.  (తిరుమలపై ‘నివర్‌’ ప్రభావం)

విద్యుత్ ‌శాఖ అప్రమత్తం
మహాబలిపురం మధ్య తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదే తీవ్రతతో తుఫాను చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్‌ సహాయక చర్యలపై ఏపీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ హరినాథ్‌ రావు మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరులలో కంట్రోల్ రూమ్స్  ఏర్పాటు చేశాము. నాయుడుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు డివిజన్‌లలో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉంటుంది. ఒక్కో డివిజన్‌కు సూపరింటెండ్ ఇంజనీరు స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాము. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి 20 ప్రత్యేక టీములను రప్పించాము. ఒక్కో టీమ్‌లో 10 మంది ఉంటారు. నిర్ణయించిన నాలుగు డివిజన్స్‌కు ముందస్తుగా విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, కండక్టర్ పంపాము. ఎక్కడైనా విద్యుత్‌కు అంతరాయం కలిగితే 1912 టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలి అని తెలిపారు.   (చెన్నైకు‘నివర్‌’ ముప్పు!)

నివర్‌ ఎఫెక్ట్‌.. యూజీ, పీజీ పరీక్షలు రద్దు
నివర్‌ తుఫాన్‌ ప్రభావం వలన అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శశిధర్‌ ఓ ప్రకటన జారీ చేశారు. ఐదు జిల్లాల పరిధిలోని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

నెల్లూరులో భారీ వర్షాలు
నివర్‌ తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తీరప్రాంత గ్రామల్లోనూ, నదులు పొంగే ప్రాంతాల్లోను ఎన్డీఆర్ఎఫ్,ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో సహా జిల్లాలో 5000 మంది సిబ్బంది తుఫాన్ రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు.

నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశాం. సాధ్యమైనంత వరకు, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. జిల్లాలో చెరువులు అన్ని నిండి ఉన్నాయి. సోమశిల జలాశయంలో 75 టీఎంసీలు, కండలేరులో 60 టీఎంసీ నీరు, సోమశిల నుండి 8,500 క్యూసెక్కులు, కండలేరు నుండి 6,500 కూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేశాము. ఆపదలో ఉన్న వారు 1077 కి కాల్ చేసి సాయం పొందవచ్చు అని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా