భారీ నష్టం మిగిల్చిన ‘నివర్‌’

17 Dec, 2020 03:45 IST|Sakshi

పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను 

ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 5,324.03 కోట్లు నష్టం  

6.62 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు 

సర్వే నంబర్లు, పంటల వారీగా పూర్తయిన మదింపు 

ఈ నెలాఖరున పెట్టుబడి రాయితీ పంపిణీ 

పారదర్శకంగా జాబితాల రూపకల్పన 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల చివరి వారంలో వచ్చిన ‘నివర్‌’ తుపాను రైతులను ముంచేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వారం రోజులకు పైగా ఎడతెరపిలేని వర్షాలు కురవడం, పెన్నా, బాహుదా తదితర నదులు ఉధృతంగా ప్రవహించడం, వాగులు, వంకలు ఉప్పొంగడంతో లక్షలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పొలాల్లోనే కుళ్లిపోయింది. అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టమోటా, వంగ, మిరప తోటలు కుళ్లిపోయాయి. ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్‌ నెలల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు అక్కడక్కడా మిగిలి ఉన్న పంటలను ‘నివర్‌’ నాశనం చేసింది. నివర్‌ తుపాను రాయలసీమ జిల్లాలపైనే అధిక ప్రభావం చూపింది.  నివర్‌ వల్ల వివిధ రంగాలకు రూ. 5,324.03 కోట్ల నష్టం వాటిల్లినట్లు క్షేత్రస్థాయి ప్రాథమిక అంచనా. ఇందులో రూ. 3,167.14 కోట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలదే కావడం గమనార్హం. కాగా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో వర్షాలకు నష్టపోయిన రైతులకు ఒక నెలలోనే పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. నివర్‌తో నష్టపోయిన రైతులకు ఈ నెలాఖరున పెట్టుబడిరాయితీ ఇచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించింది.

ఆరు జిల్లాల్లో అత్యధిక ప్రభావం.. 
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 199 మండలాల పరిధిలోని 2,105 గ్రామాలపై ‘నివర్‌’ తుపాను ప్రభావం పడింది.  
► 12 పురపాలక సంస్థలు/నగర పాలక సంస్థల్లో కూడా నివర్‌ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది.  
► వైఎస్సార్‌ కడప జిల్లాలోని మొత్తం 51 మండలాలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో 35, అనంతపురం జిల్లాలో 32 మండలాల్లో ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.  
► గోడలు కూలిపోవడం, నదుల్లో కొట్టుకుపోవడంవల్ల 11 మంది చనిపోయారు. వీరిలో చిత్తూరు జిల్లాలో  ఆరుగురు, ప్రకాశంలో ముగ్గురు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు.  
► ఏడు జిల్లాల్లో 3,679 ఇళ్లు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,708 ఇళ్లు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 1,403 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
► నాలుగు జిల్లాల్లో 7,526 ఇళ్లలో వరద నీరు నిలిచింది. ఇందులో అత్యధికంగా 7,069 ఇళ్లు వైఎస్సార్‌ కడప జిల్లాలోనివే.

 వ్యవసాయోత్పత్తులపై తీవ్ర దు్రష్పభావం 
► నివర్‌ తుపాను వల్ల 12,99,125 టన్నుల మేర వ్యవసాయోత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు (ఆమేరకు దిగుబడిపై దు్రష్పభావం) ప్రాథమిక అంచనా.  
► 662043.15 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఇందులో అత్యధికంగా 4,14,401 హెక్టార్లలో వరి పంట ఉండటం గమనార్హం.  
► వ్యవసాయ పంట నష్టం రూ. 2,831.68 కోట్లు కాగా ఇందులో వరి నష్టమే రూ. 2,194.17 కోట్లు. 
► 24,833.72 హెక్టార్లలో మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, పసుపు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 7.71 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు ఉద్యాన పంటల ఉత్పత్తులకు నష్టం జరిగింది.  నష్టం విలువ రూ. 335.46 కోట్లు. 33 శాతంపైగా పంట నష్టం జరిగిన రైతులు 47,932 మందికి రూ. 41.96 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ఉద్యాన శాఖ అధికారులు తాత్కాలిక తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.

పారదర్శకతకు పెద్ద పీట 
పంట దెబ్బతిన్నందున పెట్టుబడి రాయితీకి ఎంపిక చేసిన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి వారం రోజులపాటు అభ్యంతరాలు, సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పెట్టుబడి రాయితీకి బాధిత రైతుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఏమాత్రం అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఆమేరకు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మార్పులు చేసి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు.  

ఈనెల 31న రైతులకు పెట్టుబడి రాయితీ
రైతులకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా త్వరితగతిన ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. గత నెలాఖరులో పంట నష్టం జరగ్గా ఈనెల 31వ తేదీనే అనగా నెల రోజులకే అన్నదాతలకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు సర్వే నంబర్లవారీగా, రైతుల వారీగా పంట నష్టాల మదింపు పూర్తయింది. గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన అనంతరం మార్పులతో అధికారులు ఈ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు కూడా ప్రభుత్వం రికార్డు సమయంలో (నెలలోనే) పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకుంది. నివర్‌ బాధితులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సబ్సిడీతో విత్తనాలు కూడా సరఫరా చేస్తోంది. 

మరిన్ని వార్తలు