నిరంతర విద్యుత్‌ సరఫరాలో రాజీ లేదు..

24 Jun, 2022 09:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : సీజన్‌ ఏదైనా ఏడాది పొడవునా నిర్విరామంగా వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో రాజీ లేదని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటి పూట విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వర్షాకాలంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై విద్యుత్‌ అధికారులతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నుంచి అక్టోబర్‌ వరకూ ఆ నాలుగు నెలల్లో విద్యుత్‌ కొరత రాకుండా ప్రతి రోజూ 500 మెగావాట్ల నుంచి 1500 మెగావాట్ల వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తీసుకున్న ముందస్తు చర్యలను మంత్రి  అభినందించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటికి కూడా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. ఈ ఏడాది వేసవిలో బహిరంగ మార్కెట్లో  ధరలు అధికంగా ఉన్నా విద్యుత్‌ కొనుగోలుకు  వెనకాడలేదని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న నెలల్లో కూడా కొంటామన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ  శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు