మగవాళ్లకు మాత్రమే.. అక్కడ ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? 

31 Aug, 2022 12:16 IST|Sakshi
ఆలయం బయటే నిలుచుని హారతి తీసుకుంటున్న మహిళా భక్తులు(ఫైల్‌)

సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే.. ఇది అన్నమాచార్యులు చెప్పిన మాట. రూపాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే..లింగ, వర్గ, జాతి బేధాలు లేకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే..కానీ అక్కడ మహిళల పట్ల వివక్ష కాదుగానీ..పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం ఆనవాయితీ. అన్నమయ్య జిల్లా పుల్లంపేట  మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత.
చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

ఆలయ పరిసరాల్లో అన్ని పనులు మగవారే చేస్తారు. పూజారి పురుషుడే...నైవేద్యం పెట్టాలన్నా.. పూజ చేయాలన్నా వారే చేయడం విశేషం. ఆడవాళ్లకు ప్రవేశం లేదు. అందులోనూ సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం మగవాళ్లు మడికట్టుకుని వరుసగా పెట్టే పొంగళ్లు, కుండలతో ఊరంతా సందడిగా మారుతుంది. తిప్పాయపల్లెలో కొనసాగుతున్న పురాతన సంప్రదాయంపై ప్రత్యేక కథనం. 

పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లె గ్రామం. చుట్టూ పూలు, అరటి, మామిడి చెట్లతో, శేషాచలం అడవులతో పల్లె అందంగా కనిపిస్తోంది. గ్రామం లోపల పురాతన కాలం నాటి సంజీవరాయస్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది.

నైవేద్యం సిద్ధం చేస్తున్న పురుషులు(ఫైల్‌) 

పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజలకష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు. 

సంక్రాంతికి ముందు కొత్త సందడి 
తిప్పాయపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు వచ్చి పొంగళ్ల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలోని వీధులన్నీ పేడతో అలికి...ముగ్గులు వేసి వాటిపై పదుల సంఖ్యలో పొంగళ్లు పెట్టి వంట వండుతారు. అగ్గి మంట మొదలుకొని అన్నం అయ్యే వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు మండలంనుంచే కాక చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారు. 

ఆనవాయితీని కొనసాగిస్తున్నాం
మా గ్రామంలో పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. సంక్రాంతికి ముందు వచ్చే పొంగళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటాం. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారు.
– కేశవరెడ్డి, మాజీ సర్పంచ్, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం  

ఎంతో సందడిగా ఉంటుంది
సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం పొంగళ్లు నిర్వహించడం సంతోషదాయకంగా ఉంటుంది. ముందస్తుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లుగా..కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఊరికి రావడంతో ఊరంతా జాతరను తలపించేలా ఉంటుంది.
–ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం  

మరిన్ని వార్తలు