అక్కడ దేవుడికే దిక్కులేదు.. పట్టించుకునే వాళ్లు లేరా!

5 Dec, 2021 09:25 IST|Sakshi

క్షేత్రం ఉపాలయాల్లో భక్తులకు తప్పని కష్టాలు 

వర్షంలో తడుస్తున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు  

అధికారుల తీరుపై భక్తుల అసహనం

చూడటానికి ఆ ఆలయాలు చక్కగా కనబడతాయి. వర్షం వస్తే భక్తులపైనే కాదు గర్భాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలపై కూడా వర్షం పడుతుంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో ఆ ఆలయాలకు వచ్చే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దివ్య క్షేత్రంలోని పలు ఉపాలయాల దుస్థితి ఇది.  

సాక్షి,ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి పలు ఉప, దత్తత ఆలయాలు ఉన్నాయి. రోజూ క్షేత్రానికి వేలాదిగా వచ్చే భక్తులు చినవెంకన్న దర్శనానంతరం ఆ ఆలయాలనూ సందర్శిస్తారు. ముఖ్యంగా క్షేత్రదేవత కుంకుళ్లమ్మ, క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లీశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. చెరువు వీధిలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, పసరు కోనేరు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఆయా ఆలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను చినవెంకన్న దేవస్థానం నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. అధికారుల అలసత్వం కారణంగా ఆలయాల అభివృద్ధిలో మాత్రం డొల్లతనం బయటపడుతోంది.  

మేడిపండులా..  
మేడిపండులా కనిపించే కుంకుళ్లమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, క్షేత్రపాలకుని ఆలయాల ఆవరణల్లో ఉన్న నవగ్రహ మండపాల శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ కుంకుళ్లమ్మ ఆలయ ముఖ మండపం మడుగుగా మారుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారిపైనే వర్షం పడుతోంది. ఆ ఆలయ ప్రహరీ బాగా బీటలు వారింది. క్షేత్రపాలకుని ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపం శ్లాబ్‌ పూర్తిగా దెబ్బతినడంతో అధికారులు దాన్ని బోట్లు పెట్టి నిలబెట్టారు. భక్తులు ఆ మండపంలోనే పూజలు చేస్తున్నారు.  

ఆదాయం రూ.కోట్లలో ఉన్నా..   
శ్రీవారి ప్రధాన ఆలయానికి ప్రతి నెలా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయినా ఉపాలయాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.త్వరలో మరమ్మతులు చేయిస్తాం సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుంకుళ్లమ్మ ఆలయ శ్లాబ్‌లు దెబ్బతిన్న విషయం నా దృష్టికి రాలేదని దేవస్థానం ఈఓ జీవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఈఈ శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శ్లాబ్‌ దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది తమకు తెలపలేదన్నారు. ఈ ఆలయంతో పాటు  కుంకుళ్లమ్మ ఆలయం, నవగ్రహ మండపం శ్లాబ్‌లకు త్వరగా మరమ్మతులు చేయిస్తామన్నారు.   

చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ..

  

మరిన్ని వార్తలు