Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

5 Mar, 2022 08:22 IST|Sakshi
అన్నదానం క్యాంటీన్‌ను పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

శ్రీవారి ఆర్జితసేవలు,దర్శనాల ధరలు పెంచలేదు: టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్‌  వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని, పీఏసీ–4 (పాత అన్నప్రసాద భవనం)లోని లగేజి సెంటర్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత పదిరోజుల కిందట సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించటంతో రద్దీ పెరిగిందని చెప్పారు.

అందుకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలను ఏప్రిల్‌ నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జితసేవలు, దర్శనాల ధరలను టీటీడీ పెంచలేదని, ఆ ఆలోచన ఇప్పట్లో లేదని పేర్కొన్నారు.

ధరల పెంపుపై పాలకమండలిలో చర్చ మాత్రమే జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలను రద్దుచేశామని చెప్పారు. కొండమీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి తదితరులున్నారు.

ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు  
తిరుమల శ్రీవారిని ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.79.34 కోట్లు లభించాయి. 5.35 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 13.63 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారు. దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించారు. 329.04 ఎంఎల్‌డి నీరు, 27.76 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. 3,378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

మరిన్ని వార్తలు