పొలాల్లో ఇక విద్యుత్‌ షాక్‌ కొట్టదు

4 May, 2021 04:57 IST|Sakshi

విద్యుదాఘాతాల నుంచి రైతులకు సంపూర్ణ రక్షణ

వ్యవసాయ క్షేత్రాల్లో పాలీ కార్బన్‌ బాక్సులతో మంచి ఫలితాలు

ఈ విధానం ఎంతో మేలు చేస్తోందని రుజువు చేసిన శ్రీకాకుళం

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయం

సాక్షి, అమరావతి: వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్‌ బోరు మోటార్లకు అమరుస్తున్న పాలీ కార్బన్‌ బాక్సులు విద్యుత్‌ షాక్‌ల నుంచి రైతులను రక్షిస్తున్నాయి. ఏడాది కాలంలో శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్ల వద్ద ఈ విధానాన్ని అమలు చేయగా ఒక్క విద్యుత్‌ ప్రమాదం కూడా జరగలేదు. ఎర్త్‌ పనిచేయకుండా కరెంట్‌ షాక్‌ వచ్చినట్టు ఎక్కడా నమోదు కాలేదు. విద్యుత్‌ సబ్సిడీని రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానాన్ని ప్రభుత్వం గత ఏడాది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టింది. ఇదే సందర్భంలో వ్యవసాయ క్షేత్రంలోనే బిగించే విద్యుత్‌ మీటర్ల భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విధానాన్ని ఇటీవల అధికారులు సమీక్షించి ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తోందని గుర్తించారు. ఇకపై ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో అమర్చే విద్యుత్‌ మీటర్లకూ దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నారు.

ఆ ఘోష ఇక ఉండదు
2014 నుంచి 2020 మార్చి వరకూ రాష్ట్రంలో 93 వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్‌ ప్రమాదాలు జరిగాయి. విద్యుదాఘాతాలకు గురై 77 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది క్షతగాత్రులయ్యారు. బోర్లు ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి ప్రమాదాలు అధికంగా ఉంటున్నాయి. గత ప్రభుత్వం సకాలంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో అనధికారికంగా విద్యుత్‌ వాడుకుంటున్నారు. ఇలాంటివి రాష్ట్రంలో 50 వేల వరకూ ఉన్నాయని అంచనా. ఈ క్రమంలో సరైన విద్యుత్‌ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు.

దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్న ఎర్త్‌ విధానం సరిగా ఉండటం లేదని విద్యుత్‌ శాఖ పరిశీలనలో తేలింది. లోడ్‌ను బట్టి ఫ్యూజులు వేసుకోకపోవడం మరో కారణం. వ్యవసాయ విద్యుత్‌ ఉచితం కాబట్టి అధికారులూ అక్కడికి వెళ్లి పరిశీలించడం లేదు. ఫలితంగా విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్‌ వైర్లు చేతికందేలా ఉంటున్నాయి. అనుమతి లేని విద్యుత్‌ కనెక్షన్ల వల్ల లోడ్‌ పెరుగుతోంది. దీంతో వైర్లు వేడెక్కి సాగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 

18 లక్షల పంపుసెట్లకు పాలీ కార్బన్‌ బాక్సులు
రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి.  వీటన్నింటికీ మీటర్‌తో పాటు ఫ్యూజ్‌ బాక్స్‌ కూడా అమర్చాలని నిర్ణయించారు. పాలీ కార్బన్‌ బాక్సులను వ్యవసాయ క్షేత్రంలో డిస్కమ్‌లు అమరుస్తాయి. 32 యాంప్స్‌ సామర్థ్యంతో మూడు వైర్లను తట్టుకునే రీతిలో ఈ బాక్స్‌ ఉంటుంది. ఇలా అమర్చడం వల్ల విద్యుత్‌ ప్రసరణ ఏ స్థాయిలో ఉన్నా ఫ్యూజ్, స్విచ్‌ ఉన్న ప్రాంతంలో విద్యుత్‌ బయటకు ప్రసరించదు. 30 మీటర్ల వైర్‌ను స్విచ్, మీటర్, ఫ్యూజులకు వాడతారు. ఇది ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ మాత్రం విద్యుత్‌ షాక్‌ ఇవ్వదని, అనేక సార్లు పరీక్షించిన తర్వాతే దీన్ని వాడుతున్నామని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎర్త్‌ కోసం వాడే జీఐ వైర్, పైప్‌ కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు