అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు

10 Aug, 2020 04:53 IST|Sakshi

ప్రైవేట్‌ కోవిడ్‌ సెంటర్‌ నిబంధనలు పాటించలేదు

ఉండాల్సిన సౌకర్యాలూ లేవు 

సాక్షి, విజయవాడ : కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్‌ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కోవిడ్‌ కేంద్రానికి ఏ విధమైన అగ్నిమాపక అనుమతుల్లేవు. హోటల్‌గా వినియో గిస్తున్నట్లయితే 15 మీటర్ల ఎత్తుకు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) అనుమతులు తీసుకోవాలి. అదే కోవిడ్‌ సెంటర్‌కు కనీసం 9 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొందాలి. కానీ, ఈ రెండు అనుమతుల్లేవని సమాచారం. 

కోవిడ్‌ సెంటర్‌కు ఉండాల్సిన సౌకర్యాలు..
► కోవిడ్‌ సెంటర్‌ కానీ ఆస్పత్రి కాని నిర్వహించాలంటే రోగులను అత్యవసర పరిస్థితుల్లో స్ట్రెచ్చర్‌పై తరలించేందుకు వీలుగా ర్యాంపు ఉండాలి. 
► అగ్నిప్రమాదం జరిగితే మంటలను వెంటనే అదుపుచేసేందుకు ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. 
► మూడు చదరపు మీటర్లు దూరం వరకు నీటిని చిమ్మే స్ప్రింక్లర్లు ఉండాలి.
► ప్రమాదం జరిగిన వెంటనే నీరు వచ్చేందుకు ఆటోమేటిక్‌ డిటెక్టరు, పై అంతస్తుల్లో ఉన్న రోగులను అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం ఉండాలి. 
► ముఖ్యంగా భవనంపై వాటర్‌ ట్యాంకును నిర్మించాలి. ఇవేమీ ఈ హోటల్‌లో లేవు.
► ఆ హోటల్‌లో కరోనా కేర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదు. 

చెక్కతో చేసిన అలంకరణతో..
కాగా, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిసెప్షన్‌ ఉంది. దాని పక్కనే మెట్లు, లిఫ్ట్‌ ఉంది. రిసెప్షన్‌ నుంచే అన్ని గదులకు కేబుల్స్‌ ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌వల్ల కేబుల్స్‌లో అంతర్గతంగా (మౌల్డింగ్‌లో ఇంటర్నల్‌ కంబర్షన్‌) మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. మంటలు బయటకు రాగానే ఆక్సిజన్‌తో కలిసి మంటలు ఒక్కసారిగా ఎగసిపడి ఉంటాయంటున్నారు. రిసెప్షన్‌ నుంచి రెండో అంతస్తు వరకు (డూప్లెక్స్‌ తరహాలో) అలంకరణకు చెక్కను బాగా వినియోగించడంవల్లే మంటలు తీవ్రంగా వ్యాప్తిచెందడానికి కారణమైంది.

మరిన్ని వార్తలు