రామతీర్థంలో సెక్షన్ 30 అమలు

5 Jan, 2021 09:56 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్‌ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

మరోవైపు రామతీర్థంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. తొలుత సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కాగా రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు