తిరుపతిలో టీడీపీ డీలా

15 Apr, 2021 03:05 IST|Sakshi

చంద్రబాబు, లోకేష్‌ ప్రచారం చేసినా కనిపించని స్పందన

ప్రజాదరణ కోల్పోయి డ్రామాలతో కాలక్షేపం చేస్తున్న తండ్రీ కొడుకులు

సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. వరుస ఓటములతో నీరుగారిపోయిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేక ఇబ్బందులు పడుతోంది. గెలిచే అవకాశం ఏ కోశానా కనిపించక పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ప్రచారం చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు. వారం రోజుల నుంచి చంద్రబాబు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి కొన్ని చోట్ల ఇంటింటి ప్రచారం చేసినా స్పందన కనిపించలేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. అంతకు ముందు లోకేష్‌ ప్రచారం చేసినప్పుడు కూడా జనం పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో మరింత నిస్తేజం ఆవరించింది. వారి సభలకు జనాన్ని సమీకరించడమే స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సభలకు వచ్చేందుకు జనం ఆసక్తి చూపించ లేదని, బలవంతంగా తీసుకువచ్చిన జనం కూడా చంద్రబాబును పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. దీనికితోడు వచ్చిన వారిని చంద్రబాబు తిట్టడం, సంబంధం లేకుండా మాట్లాడడం మరీ ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ వంటి నేతలు హడావుడిగా తిరుగుతూ సమీక్షలు నిర్వహించడం, మీడియాలో హడావుడి చేయడం తప్ప తమకు ప్రజల్లో ఎటువంటి అనుకూలత కనిపించడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అసెంబ్లీ సెగ్మెంట్లలో అయోమయం  
మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించేదెవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా సత్యవేడు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించే సరైన నాయకులే లేరు. దీంతో క్యాడర్‌ నిస్తేజంలో ఉంది. గూడూరు నియోజకవర్గం.. ప్రస్తుతం పోటీలో ఉన్న పనబాక లక్ష్మి సొంత ప్రాంతం కావడంతో ఆమె పరిచయాలు కొంత ఉపయోగపడతాయనే ఆశతో ఉన్నారు. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని జనం పట్టించుకునే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి అంత చురుగ్గా లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం డీలా పడ్డాయి. చంద్రబాబు తిరుపతి నియోజకవర్గంపైనే ఆశలన్నీ పెట్టుకున్నా అక్కడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుగుణమ్మపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎదురీదుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 55 శాతానికిపైగా ఓట్లు రాగా, టీడీపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో 25 శాతం ఓట్లు రావడం కూడా కష్టమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సానుభూతి కోసం రాళ్ల డ్రామాకు చంద్రబాబు, ప్రమాణ నాటకానికి లోకేష్‌ తెరతీసినా ఫలితం కనిపించలేదు.   

మరిన్ని వార్తలు