నీటిపై రాతలు అవాస్తవం 

12 Jul, 2022 21:14 IST|Sakshi

ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఏఈ వెంకటేశ్వరరావు

రూ.41 లక్షలతో పైపులైన్‌ ఏర్పాటు

ఓ పత్రిక కథనాలపై ఖండన

ఫిరంగిపురం(పల్నాడు జిల్లా): ఫిరంగిపురం ఆరోగ్యనగర్‌లోని జగనన్న లేఅవుట్‌ల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రూ.41లక్షలు వెచ్చించి పైపులైన్‌ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని పత్రికలు కట్టు కథలు ప్రచారం చేస్తున్నాయి. నీటి సరఫరాపై ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం లేఅవుట్‌లను సందర్శించారు. 3,4 నెంబర్‌గల లేఅవుట్లలో జరుగుతున్న పైపులైన్‌ పనులను పరిశీలించారు. 

బోర్లు రెండు నెలల కిందట వినియోగంలోకి వచ్చాయన్నారు. నాలుగో లేఅవుట్‌లో 625 గృహాల నిర్మాణం జరుగుతుందని, నీటి అవసరాల కోసం రేపూడి గ్రామంలోని సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాళ్లూరు రోడ్డు నుంచి వసంతనగర్‌ మీదుగా ఆరోగ్యనగర్‌కు పైపులైను ఏర్పాటు చేశామన్నారు. పైపులైను వేసే సమయంలో స్థానికంగా ఉన్న వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో ఆసమస్యలను పరిష్కరించుకొని రెండురోజుల కిందట నీటి సరఫరా చేశామన్నారు. వాటిలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చొరవతో పూర్తిస్థాయిలో నేడు నీటిని విడుదల చేసి 70 వరకు ట్యాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు నీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పడం అవాస్తవమన్నారు.     

లోతట్టులో గృహాలు లేవు 
ప్రధాన రహదారి లోతట్టులో లేదు. అంతర్గత రోడ్ల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి. ప్రధాన రహదారితో పోల్చకూడదు. అంతర్గత రోడ్ల కన్నా ఇచ్చిన ప్లాట్లు లోతులో ఉంటే మాత్రమే మెరక చేయాలి, లేనిఎడల అవసరం లేదు. నీటికోసం రూ.41 లక్షలు మంజూరు చేశారని వాటితో పైపులైన్‌ వేశారు. లబ్ధిదారులు ఆ నీటినే వాడుకుంటున్నారు.
– పింకి, ఏఈ, హౌసింగ్‌ శాఖ

బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు..
ఆరోగ్యనగర్‌లోని జగనన్న కాలనీలో నీటి కోసం అధికారులు బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు. కొళాయిలు నుంచి నీరు కూడా వస్తుండటంతో ఆ నీటిని డ్రమ్ములతో పట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోడానికి నీటికోసం ఇబ్బందులు లేవు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో పనివారు రాకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం.
– ఆర్‌.ఇన్నయ్య లబ్ధిదారుడు 

నీటి ఇబ్బందులు లేవు 
జగనన్న కాలనీలో నీటికి ఇబ్బందులు లేవు. రెండురోజుల కిందట అధికారులు నీటి సరఫరా చేశారు. రెండు నెలల కిందటే బోర్లు వేశారు. మా లేఅవుట్‌ ప్రాంతంలో 17 ట్యాప్‌లు ఏర్పాటుచేశారు. బజారుకో పంపు రెండు కొళాయిలు ఇచ్చారు. వాటిని వినియోగించుకుంటున్నాం.  
– పి.లూర్దుమరియన్న. గృహ లబ్దిదారుడు.

మరిన్ని వార్తలు