YSR District: తీరిన మూగవేదన

30 Apr, 2022 13:57 IST|Sakshi

త్వరలో అందుబాటులోకి సంచార వైద్యసేవలు

నియోజక వర్గానికి ఒక ప్రత్యేక వాహనం

108 తరహాలో 1962తో మూగజీవాలకు మొబైల్‌ అంబులెన్స్‌ 

ఆనందంలో అన్నదాతలు

కడప అగ్రికల్చర్‌: నాడు అత్యవసర వైద్య సేవ లకు కోసం మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 108 అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నోరు లేని మూగజీవాల వైద్య సేవల కోసం 1962 వాహనాన్ని తెచ్చి చరిత్రపుటల కెక్కనున్నారు.

పశువులు వ్యాధుల బారిన పడితే 1962కు కాల్‌ చేస్తే  ఎక్కడ వైద్య సేవలవసరమో అక్కడికే వాహనం రానుంది. ఈ అంబులెన్స్‌లో పశుసంవర్ధశాఖకు సంబంధించిన పశుౖవైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, అటెండర్‌ కమ్‌ డ్రైవర్‌ ఉంటారు. రైతు సమాచారం అందించగానే వారు సంఘటన స్థలానికి వెళ్లి వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. అలాంటి వాహనాలు జిల్లాకు 7 అందుబాటులోకి రానున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.  

నియోజక వర్గానికి ఒకటి చొప్పున.. 
జిల్లాకు సంబంధించి వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద ఏడు వాహనాలు రానున్నాయి. వీటి ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని పశుసంవర్థశాఖ ఏడీ పర్యవేక్షణలో సేవలు అందనున్నాయి.  

మూగజీవాల ఆరోగ్యానికి భరోసా
వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా గ్రామాల్లోనే పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించనున్నారు. అన్నదాతలను అదుకోవడమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1962 వాహనాలను ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3.99 లక్షల గేదెలు ఉండగా అందులో 2.50 లక్షలు పాడిపశువులు, 13.56 లక్షల గొర్రెలు ఉన్నాయి. 11 లక్షలు కోళ్లు కూడా ఉన్నట్లు పశువైద్య అధికారులు తెలిపారు. ఈ మొబైల్‌ వాహనంతో మూగ జీవాల ఆరోగ్యానికి మరింత భరసా లభించనుంది.  

వైద్య సేవలు పొందేదిలా..
108 తరహాలో 1962 నంబర్‌కు ఫోన్‌  చేయగానే  పశువైద్యశాఖకు సంబంధించిన ప్రధాన కేంద్రానికి వెళుతుంది. అక్కడి నుంచి వారు రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు బాగాలేని పశువు, గెదె, మేక వంటి వాటి గురించి ఆరా తీసి సంబంధింత సమాచారాన్ని దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి చేరవేస్తారు.అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెళ్లి ప్రాథమికంగా పశువును పరీక్షించి వైద్య సేవలందిస్తారు. అత్యవసరమైతే అక్కడికి అంబులెన్స్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని పెద్దాసుపత్రికి తరలిస్తారు. 

మే రెండవ వారంలో... 
జిల్లాలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ కింద మే రెండో వారంలో సేవలు ప్రారంభం కానున్నాయి.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని  ప్రారంభించగానే జిల్లాకు వాహనాలు వస్తాయి. అప్పటి నుంచి జిల్లాలో కూడా సేవలు ప్రారంభిస్తాం. మూగ జీవాలకు ఆరోగ్యం సరిగా లేదని సమాచారం రాగానే వాహనం అక్కడికి వెళ్లి అక్కడికక్కడే సేవలు అందిచి అన్నదాతను ఆదుకుంటుంది.  
– తెలుగు. వెంకట రమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి,వైఎస్సార్‌జిల్లా

సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ అసుపత్రి: 01 
వెటర్నరీ పాలిక్లినిక్‌: 01 

ఏరియా వెటర్నీరీ హాస్పిటల్స్‌: 17 
వెటర్నరీ డిస్షెన్సరీస్‌: 79 

రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు: 78
డివిజనల్‌ ఆఫీసర్లు: 03 

పశు వైద్యులు: 117
వెటర్నరీ అసిస్టెంట్లు: 108 

జిల్లాలో ఆర్‌బీకేలు : 414 

మరిన్ని వార్తలు