విశాఖ రాజధానిని.. ఈసారి చేజార్చుకోం

14 Oct, 2022 06:40 IST|Sakshi

సీఎం జగన్‌ మరో అవకాశాన్నిచ్చారు.. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు

రాజధాని నిర్ణయంలో దూరాల ప్రస్తావన అనవసరం 

కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతిస్తాం? 

‘విశాఖ గర్జన’తో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతాం 

విద్యార్థి నుంచి పింఛన్‌ తీసునే వృద్ధుల వరకూ అందరిలో చైతన్యం తెస్తాం 

‘సాక్షి’తో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ 

సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్‌ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌ వివరించారు. కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతించగలమని ఆయన ప్రశ్నించారు.

ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనతో రాజధాని పోరు మొదలవుతుందనీ.. భవిష్యత్తులో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ అన్ని సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ పునరుద్ఘాటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది 
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలనే అంశంపై ఓటింగ్‌ జరిగింది. ఇందులో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం అని.. 58 మంది కర్నూలు అని ఓటువేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. అప్పటికే కర్నూలుని రాజధానిగా చెయ్యాలని నిర్ణయించుకున్న నాటి ప్రభుత్వం.. 1956 ఏప్రిల్‌ 1 నుంచి విశాఖపట్నంని రాజధానిగా చేస్తామంటూ అసెంబ్లీ తీర్మానించింది. కానీ, ఇది అమల్లోకి రాకపోయినా.. అప్పటి నేతలు పోరాడలేకపోయారు.

అప్పటినుంచి అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికి సీఎం వైఎస్‌ జగన్‌ మరో అవకాశాన్ని కల్పించారు. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికే రెండు తప్పులు చేశాం. మళ్లీ అమరావతిని మాత్రమే అభివృద్ధిచేస్తే.. చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులువేయకపోతే.. భవిష్యత్తులో మరోసారి విభజన ఉద్యమం తలెత్తక తప్పదు.  

కుటిల బుద్ధితో వస్తే ఎందుకు స్వాగతించాలి? 
కొందరు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఎదగాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదనే కుటిలబుద్ధితో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో వస్తే ఎందుకు స్వాగతించాలి. ఇక రాజధాని కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నాన్‌పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటైంది. విశాఖలో రాజధాని ఏర్పాటయ్యేంత వరకూ పోరాటంచేస్తాం. 15న విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతున్నాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యార్థి నుంచి పింఛన్‌ తీసుకునే వృద్ధుల వరకూ.. వికేంద్రీకరణ తదనంతరం జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం.  

దూర ప్రస్తావన అప్రస్తుతం? 
విశాఖ రాజధాని అయితే.. భౌగోళికంగా మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. కానీ, ఈ వాదనలో బలంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో పనికోసం వచ్చే వారి శాతం 0.01 కూడా వుండదు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చాక.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. అందుకే దూర ప్రస్తావన అప్రస్తుతమనే చెప్పాలి.

ఇక గత కొన్ని దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో రాజధానులున్న ప్రాంతాల చుట్టుపక్కలున్న జిల్లాల తలసరి ఆదాయం, ఆయా జిల్లాల వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులవల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల సమన్వయ అభివృద్ధికి దోహదమవుతుంది. క్రమంగా జీడీపీ కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   

మరిన్ని వార్తలు