రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..

11 Nov, 2022 05:02 IST|Sakshi

వికేంద్రీకరణ, విశాఖ పాలన రాజధాని అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి 

ఏకగ్రీవంగా తీర్మానించిన విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక 

టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు.

ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. 
 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి చెప్పారు.

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.  

ఎవరు అడ్డుపడినా ఊరుకోం..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం.  
– ప్రొఫెసర్‌ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్‌ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌. 

మద్దతిద్దాం.. 
వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర  ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి.
– పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత

ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ
విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత  

ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.
    – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు.

భావి తరాల భవిత కోసం.. 
విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. 
– దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్‌ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌. 

మరిన్ని వార్తలు