కరోనా వేళా ఆగని రిజిస్ట్రేషన్లు  

5 Jun, 2021 04:54 IST|Sakshi

ఏప్రిల్, మే నెలల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా లభించిన ఆదాయం రూ.650.37 కోట్లు 

గతేడాది ఆ రెండు నెలల్లో వచ్చిన ఆదాయం రూ.180 కోట్లే 

సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి వేళ రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు సాధారణ రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గినా.. ఇబ్బందులను అధిగమించి ఇబ్బడిముబ్బడిగానే జరిగాయి. ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఏప్రిల్, మే నెలల్లో రూ.650.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఆ రెండు నెలల్లో రూ.1,125.12 కోట్లు ఆదాయం ఆర్జించాల్సి ఉంది. కరోనా కల్లోలం సృష్టించడంతో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయక లక్ష్యం మేరకు ఆదాయం రాలేదు. అయినా.. లక్ష్యంలో 57.80 శాతం రెవెన్యూ సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ రెండు నెలల్లో కేవలం రూ.186.46 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.463.91 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. కోవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం ద్వారా ఆదాయాన్ని పెంచగలిగారు.  

1,91,696 రిజిస్ట్రేషన్లు 
ఈ రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,91,696 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23,674 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. తూర్పు గోదావరి జిల్లాలో 21,197, పశ్చిమగోదావరి జిల్లాలో 16,756 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 6,950 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెవెన్యూ పరంగా చూస్తే (నిర్దేశిత లక్ష్యం మేరకు).. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రూ.39.98 కోట్లు (లక్ష్యంలో 73.94%), ఆ తర్వాత నెల్లూరులో రూ.40.29 కోట్లు (లక్ష్యంలో 70.49 శాతం), కర్నూలులో రూ.51.63 కోట్లు (లక్ష్యంలో 70.05 శాతం) ఆదాయం లభించింది. శ్రీకాకుళంలో అతి తక్కువగా రూ.14.10 కోట్లు (లక్ష్యంలో 42.43 శాతం) ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలోనూ తక్కువగా రూ.35.02 కోట్లు (లక్ష్యంలో 46.83 శాతం) రెవెన్యూ వసూళ్లు జరిగాయి.

ఉద్యోగులు కష్టపడ్డారు 
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసిన ఉద్యోగులకు అభినందనలు. 
– ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్‌ అండ్‌ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ   

>
మరిన్ని వార్తలు