ట్రిపుల్‌ ఐటీ భవితకు దివిటీ

24 Apr, 2022 18:52 IST|Sakshi

ఏటా కోర్సు పూర్తిచేస్తున్న విద్యార్థులు దాదాపు 600 మంది

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో రూ.7 లక్షల నుంచి రూ.14 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్థిరపడిన పలువురు విద్యార్థులు

ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న మరికొందరు

ప్రతిభ గల పేద విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు ఉచిత విద్యనందించే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కళాశాలలను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో చదువు పూర్తిచేసుకుని బయటికి వచ్చిన విద్యార్థులు మెరుగైన ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు అందుకుంటున్నారు. పలువురు విదేశాల్లో చదువులు, కొలువులకు సైతం వెళ్తుండగా, మరికొందరు  ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి స్థిరపడినవారూ ఉన్నారు.   
– నూజివీడు 

ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉన్నత సాంకేతిక విద్యను అందిస్తూ నూజివీడు ట్రిపుల్‌ఐటీ పేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. ఆరేళ్లపాటు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా చదువుకుంటున్న విద్యార్థులు క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో సత్తాచాతున్నారు. ఏటా 350 నుంచి 500 మందికి పైగా వి ద్యార్థులు మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.60 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ప్యాకేజీలకు ఎంపికవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కొలువులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇస్రోలో సైంటిస్టులుగా, రైల్వేలో ఉన్నతోద్యోగులుగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్‌ శా ఖల్లో ఇంజినీర్‌లుగా, బ్యాంకు, సచివాలయ ఉద్యోగులుగా ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు పనిచేస్తున్నారు.  

సీడీపీసీ ప్రముఖ పాత్ర : విద్యార్థులు ప్లేస్‌మెంట్లు సాధించడంలో కెరీర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ (సీడీపీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులకు మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడం, కంపెనీల అవ సరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను అన్నిరకాలు గా తీర్చిదిద్దేలా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ వారిని ప్లేస్‌మెంట్‌లకు వచ్చేలా చేస్తున్నారు.  

ప్రపంచ స్థాయి కంపెనీలు 
ప్రపంచస్థాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, టెక్‌మహీంద్ర, క్యాప్‌జెమినీ, ఎఫ్ట్రానిక్స్, ఫ్రెష్‌డెస్క్, థాట్‌వర్క్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఐబీఎం, సినోప్‌సిస్, ఇంటెల్‌ తదితర 80 కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి.   

3,856 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 
ట్రిపుల్‌ఐటీలో ఇప్పటివరకూ 8 బ్యాచ్‌లు కోర్సును పూర్తిచేసుకుని వెళ్లగా వీరిలో 3,856 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు వచ్చాయి. మరికొందరు గేట్‌లో ర్యాంకులు సాధించి ఎంటెక్‌ చదువుతున్నారు. ఈ ఏ డాదిలో ఇప్పటివరకూ 768 మందికి ఉద్యోగాలు రాగా అన్‌లాగ్‌ డివైస్‌ కంపెనీ ఏడాదికి రూ.20 లక్షల జీతంతో నలుగురిని, గప్‌చుప్‌ టెక్నాలజీస్‌ రూ.15 లక్షల వేతనంతో ఇద్దరిని, జస్‌పే సంస్థ రూ.27 లక్ష ల వేతనంతో ఒక విద్యార్థిని ఎంపిక చేసుకున్నాయి.  

వైఎస్సార్‌ వెలుగులు నింపారు  
ట్రిపుల్‌ఐటీ స్థాపించి దివంగత వైఎస్సార్‌ నా జీవితంలో వెలుగులు నింపారు. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ బ్రాంచితో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. తర్వాత మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదివా. ఏడాదిన్నర పాటు దక్షిణ మధ్య రైల్వేలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేశా. ప్రస్తుతం ఇస్రో ప్రధాన కార్యాలయం (బెంగళూరు)లో సైంటిస్టు–సీగా పనిచేస్తున్నా.   
–గుత్తా వెంకట శేషారావు, ఇస్రో సైంటిస్ట్‌

మరిన్ని వార్తలు