రాయలసీమకు కాస్త తక్కువ వర్ష సూచన

17 Apr, 2021 03:33 IST|Sakshi

ఈ ఏడాది సాధారణ వర్షాలు

వారం ముందే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

సగటున 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం

రాయలసీమకు కాస్త తక్కువ వర్ష సూచన

వెల్లడించిన ఐఎండీ

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. సాధారణ వర్షపాతం నమోదైతే దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడవు. ఏటా రుతుపవనాల సీజనుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో ఐఎండీ నైరుతి రుతుపవనాల తీరుతెన్నుల (దీర్ఘకాలిక వ్యవధి సగటు–ఎల్‌పీఏ) అంచనాలను రూపొందిస్తుంది. ఈ అంచనాల తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నాలుగు నెలల పాటు ప్రభావం చూపుతాయి. ఐఎండీ 1961–2010 మధ్య కాలానికి దేశవ్యాప్తంగా ఎల్‌పీఏ సగటు 88 సెంటీమీటర్ల వర్షపాతంగా తేల్చింది. ఎల్‌పీఏ సగటు 96 నుంచి 104 శాతం (అంటే ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువ) అంచనా వేస్తే.. ఆ ఏడాది సాధారణ వర్షపాతమని లెక్క. వచ్చే నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.

ప్రస్తుత నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో కోస్తా కంటే రాయలసీమలో వర్షాలు తక్కువగా కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచనలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఐఎండీ మే నెలలో రెండోవిడత నివేదిక విడుదల చేస్తే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ మే 31 లేదా జూన్‌ మొదటి వారంలో కేరళని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి 5 నుంచి 7 రోజుల ముందే వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోను సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మోహపాత్రా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం, కొన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు