‘నైరుతి’ నిష్క్రమణం.. ‘ఈశాన్యం’ ఆగమనం

27 Oct, 2020 03:56 IST|Sakshi
దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న తీరు చూపించే చిత్రం

రేపు కోస్తాలో ప్రవేశించనున్న ఈశాన్య రుతు పవనాలు

సాక్షి, విశాఖపట్నం: విస్తారమైన వానల్ని కురిపించిన నైరుతి రుతు పవనాలు సోమవారం రాష్ట్రం నుంచి నిష్క్రమించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 28న నైరుతి రుతు పవనాలు వైదొలగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారత్‌పై దిగువ ట్రోపో ఆవరణం స్థాయిలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. ఇవి ముందుకు కదిలి.. కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి ప్రాంతాల్లో 28న వర్షాలతో ప్రవేశించనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

మొత్తానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు 8.7 శాతం మిగులు వర్షపాతంతో వైదొలగనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. రాగల రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు