నాట్‌ బిఫోర్‌ మీ : జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

3 Nov, 2020 12:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ విభాగం మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. విచారణ సందర్భంగా "నాట్‌ బిఫోర్‌ మీ" అని అన్నారు. వ్యక్తిగతమైన కారణాలతో ఆయన ఈ కేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో శీతాకాలం సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది.

కాగా డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావును  సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్‌) ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. అనంతరం సస్పెన్సన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టును తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టలో సవాలు చేసింది. 
 

మరిన్ని వార్తలు