విధులకు రాని వైద్యులకు నోటీసులు

11 Oct, 2021 03:33 IST|Sakshi

కర్నూలు వైద్య కళాశాలలో 20 మందికి మెమో

బయోమెట్రిక్‌ హాజరు వేయకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్న వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో విధులకు రాని వైద్యుల విషయం చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు మూడు రోజులే వచ్చి మిగతా రోజులకు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నవారు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు తేలింది. దీనిపై ఆరా తీస్తున్న కొద్దీ విస్మయపరిచే అంశాలు వెల్లడవుతున్నాయి. తాజాగా కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 20 మంది వైద్యులకు నోటీసులు ఇచ్చారు. బయోమెట్రిక్‌ హాజరు లేకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేసి విధులకు వచ్చినట్టు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిలో బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం.

విధులకు రాకుండా రిజిస్టర్లలో సంతకాలు సృష్టిస్తున్నవారు 48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్‌ మెమో జారీ చేశారు. నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు, కడప తదితర కాలేజీల్లో బయోమెట్రిక్‌  వేయకుండా విధులకు వచ్చినట్టు చూపిస్తున్నవారి విషయం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్‌ (రిజిస్టర్‌) సంతకాలు కుదరవని, బయోమెట్రిక్‌ హాజరు ఉంటేనే వేతనం ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారు. ఇప్పటికీ చాలా చోట్ల కొంతమంది వైద్యులు బయోమెట్రిక్‌ హాజరు కోసం నమోదు కూడా చేయించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. చాలామంది వైద్యులు ఎలాంటి సమాచారమూ లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారు.  

మరిన్ని వార్తలు