4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్‌ 

7 Apr, 2022 03:25 IST|Sakshi

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనెల 16వ తేదీ వరకు గడువు.. నెలాఖరులోగా పోస్టుల భర్తీ పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ఇప్పటికే 3,393 పోస్టులు భర్తీ చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌  

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4,755 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలకు వెళ్లే అవసరం లేకుండా.. గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలందించేందుకు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు. గతేడాది నవంబర్‌లో 3,393 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి.. నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా మరో 4,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం నుంచి ఈ నెల 16 వరకు గడువిచ్చింది. 

అర్హతలు.. 
► అభ్యర్థులు ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.  నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. 
► అభ్యర్థులు hmfw.ap.gov.in,cfw.ap.nic వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. 

మరిన్ని వార్తలు