అమెరికాలో ఆమెతో రిలేషన్‌షిప్‌.. ఏపీలో మరో యువతిని ట్రాప్‌ చేసి..

13 Oct, 2022 12:07 IST|Sakshi

పట్నంబజారు (గుంటూరు తూర్పు):  ఒకరికి తెలియకుండా ఒకరిని... మొత్తం ఐదుగురిని వివాహం  చేసుకున్న పెళ్లి కొడుకు కర్నాటి సతీష్‌ బాబు యువతులను మోసం చేసిన కేసు ఘటన మరువక ముందే మరో ప్రబుద్ధుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎన్నారై ముసుగులో భారీగా కట్న కానుకలు తీసుకుని.. నెలల వ్యవధిలోనే మరో మహిళను వివాహం చేసుకున్న నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు అందింది. 

వివరాల ప్రకారం.. చేబ్రోలు చెందిన ఒక యువతిని పొన్నూరుకు చెందిన ఎన్నారై, సాఫ్ట్‌వేర్‌గా పనిచేసే వ్యక్తికి ఇచ్చి ఈ ఏడాది మే నెలలో వివాహం చేశారు. రూ.50 లక్షల కట్నం, బంగారు ఆభరణాలను లాంఛనాలుగా ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో వివాహం చేసుకున్న రెండు నెలల వ్యవధిలోనే మరో యువతిని సదరు ప్రబుద్ధుడు ఆమెరికాలో వివాహం చేసుకున్నాడు. 

అయితే, అక్కడ వివాహం చేసుకున్న మహిళ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా చేబ్రోలు యువతితో పరిచయం చేసుకుని.. పలుమార్లు ఓ విషయం చెప్పాలని మేసేజ్‌లు పంపింది. ‘ప్రస్తుతం తాను.. నీ భర్త ఇక్కడ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని.. నువ్వంటే నీ భర్తకు ఇష్టం లేదని చెప్పి’.. అమెరికాలో ఉన్న మహిళ.. ఫోటోలను  పంపింది. ఈ విషయం పెళ్లికొడుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ చెప్పకపోగా, వివాహ సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ.. ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. పెళ్లి చేసుకునే సమయంలో అమెరికా తీసుకుని వెళ్తానని చెప్పి.. మోసం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ వివాహం చేసుకున్న కొద్ది నెలలకు స్వగ్రామానికి వచ్చిన సమయంలో సైతం ఇక్కడే ఉండేందుకు ‘మై వైఫ్‌ ఈజ్‌ డెడ్‌’ అని కంపెనీ నిర్వాహకులకు మెసేజ్‌ పెట్టి.. రెండు నెలల వర్క్‌ ఫ్రం హోం తీసుకున్న విషయం గమనించిన వివాహిత ఎంతో కుంగిపోయింది.

ఈ క్రమంలో అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటం, పెద్ద మనషుల సమక్షంలో జరిగిన పంచాయితీని సైతం పక్కనబెట్టి తాను ఇష్టానుసారంగా బాధితురాలిని వేధింపులకు గురి చేస్తుండటంతో దిశ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  మరో నిత్యపెళ్లి కొడుకు అంశం తెరపైకి రావటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చేబ్రోలు మహిళ, అమెరికాలో మరో మహిళ కాకుండా మరేమైనా వివాహాలు చేసుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిత్య పెళ్లికొడుకు కేసును దర్యాప్తు చేసిన జిల్లా ఉన్నతస్థాయి అధికారి ఈ కేసును విచారణ చేపట్టినట్లు సమాచారం. పోలీసు విచారణలో భాగంగా మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు