సచివాలయ సేవల్లో ఇదో అద్భుతం

18 Nov, 2020 05:29 IST|Sakshi
సచివాలయం–2లో సేవలందిస్తున్న సెక్రటరీ సురేష్‌ (నీలం రంగు చుక్కల చొక్కా ధరించిన వ్యక్తి), సిబ్బంది

అమెరికాలో ఉంటూ గ్రామ సచివాలయం ద్వారా బర్త్‌ సర్టిఫికెట్‌ పొందిన ప్రవాసాంధ్రుడు 

60 రోజుల గడువులో ఇవ్వాల్సిన సర్టిఫికెట్‌ 15 రోజుల్లోనే జారీ 

సేవలకు సంతోషించి రూ.1.10 లక్షల విరాళమిచ్చిన ఎన్‌ఆర్‌ఐ

కొత్తపేట: అమెరికాలో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా వాసి ఇక్కడకు రాకుండానే కేవలం 15 రోజుల్లో బర్త్‌ సర్టిఫికెట్‌ పొందారు.  జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల గ్రామం రెండో వార్డుకు చెందిన యర్రాప్రగడ కృష్ణకిషోర్‌ సుమారు పదేళ్ల కిందట అమెరికాలోని చికాగో వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయనకు గ్రీన్‌ కార్డు ఇమ్మిగ్రేషన్‌ నిమిత్తం బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరమైంది. కోవిడ్‌ కారణంగా ఇక్కడికి స్వయంగా రాలేని ఆయన ఆ సర్టిఫికెట్‌ కోసం కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. స్పందించిన కలెక్టర్‌ రాజమహేంద్రవరం డీఎల్‌డీఓ, కొత్తపేట ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ కె.రత్నకుమారికి ఆ సమాచారం పంపించారు.

ఆమె కృష్ణకిషోర్‌ నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు రప్పించుకుని, తహసీల్దార్‌ జీడీ కిశోర్‌బాబుకు పంపించారు. ఆయన వీఆర్‌ఓ కె.శ్రీనివాస్‌ ద్వారా విచారణ జరిపించి, నివేదికను అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌కు సమర్పించారు. ఆయన సూచనల మేరకు పలివెల గ్రామ సచివాలయం–2 కార్యదర్శి కె.సురేష్, డిజిటల్‌ అసిస్టెంట్‌ లాజరస్‌ సాయంతో డేటా ఎంట్రీ చేసి, ఈ నెల 14న ఈ–మెయిల్‌ ద్వారా చికాగోలో ఉన్న దరఖాస్తుదారు కృష్ణకిషోర్‌కు బర్త్‌ సర్టిఫికెట్‌ను మెయిల్‌ ద్వారా పంపించారు. దీనివల్ల ఆయనకు అమెరికాలో గ్రీన్‌ కార్డు ఇమ్మిగ్రేషన్‌ పని పూర్తయ్యింది. సాధారణంగా ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు బర్త్‌ సర్టిఫికెట్‌ పొందటానికి 60 రోజుల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా కేవలం 15 రోజుల్లోనే సర్టిఫికెట్‌ అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణకిశోర్‌ గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును అభినందిస్తూ కలెక్టర్‌కు లేఖ రాశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అసమానమైన సేవలు అందిస్తుండటం గొప్ప విషయమని అందులో పేర్కొన్నారు. కృష్ణకిశోర్‌ తాను అమెరికా నుంచి పలివెల వచ్చి వెళ్లేందుకు రూ.1.10 లక్షలు ఖర్చయ్యేదని తెలిపారు. ఆ మొత్తాన్ని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి పంపించి.. కలెక్టర్‌ సూచించిన మేరకు ఆ నిధులను వినియోగించాలని కోరారు. దీంతో గ్రామ కార్యదర్శి సురేష్కు కలెక్టర్‌ రూ.5 వేలు రివార్డు ప్రకటించి, మిగిలిన రూ.1.05 లక్షలను గ్రామ సచివాలయ అభివృద్ధికి కేటాయిస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. సంబంధిత అధికారులను, కార్యదర్శి సురే‹Ùను, సచివాలయ సిబ్బందిని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు.  

>
మరిన్ని వార్తలు