Amma Vodi: 6.27 లక్షల మందికి ప్రయోజనం.. ‘అమ్మ ఒడి’కి చేరేలా..

16 Apr, 2022 16:27 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యార్థుల్లో అర్హులందరికీ అమ్మ ఒడి పథకం అందేలా కసరత్తు జరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న సుమారు 6.27 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వేసవి సెలవులు అనంతరం బడులు తెరిచిన వెంటనే ఒక్కొక్క విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ఏ ఒక్క విద్యార్థికీ లబ్ధి చేకూర లేదనే మాట రాకుండా విద్యాశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలూ 
తీసుకుంటున్నారు.  

సచివాలయాల్లో జాబితాలు 
చైల్డ్‌ ఇన్ఫోతో అనుసంధానమై ఉన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించారు. పాఠశాల హెచ్‌ఎం లాగిన్‌లో కూడా జాబితాలు ఉంచారు. ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా ఉంటేనే, నేరుగా దానిలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా సచివాలయ విద్యా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలను పరిశీలన చేసి, అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అనేది ధ్రువీకరించాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు.

ఆధార్‌ కార్డు వేర్వేరు బ్యాంకు అకౌంట్లతో అనుసంధానమై ఉంటే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ కారణాల వల్లనే గతంలో చాలా మందికి సకాలంలో డబ్బులు జమ కాలేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ విద్యాకార్యదర్శులు దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.   

అర్హులకే అమ్మ ఒడి 
విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొంత మంది అనర్హులు కూడా పథకం ద్వారా ప్రయోజనం పొందారనే ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా, ఫిర్యాదులు వాస్తవమేనని తేలింది. సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు, ఆదాయ పన్నులు చెల్లిస్తున్న వారు, సొంత కార్లు ఉన్న వారికి సైతం పథకం అందిందని గుర్తించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలా 36,917  మంది లబ్ధిదారుల పేర్లుపై నిశిత పరిశీలన చేసి, వాస్తవికతను ధ్రువీకరిస్తున్నారు. అన్ని రకాలుగా అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు 
ప్రభుత్వ పథకాల పారదర్శకత కోసం అర్హుల జాబితాలు సచివాలయంలో ఎప్పడూ అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేర్లు తొలగిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్నదంతా తప్పుడు ప్రచారం. విద్యార్థులు తల్లిదండ్రులు అటువంటి ప్రచారాన్ని విశ్వసించొద్దు. అర్హులైన విద్యార్థులు అందరికీ అమ్మ ఒడి పథకం  మంజూరవుతుంది. 
– తాహెరా సుల్తానా, ఉమ్మడి కృష్ణా జిల్లా నోడల్‌ అధికారి  

మరిన్ని వార్తలు