మూడేళ్లలో నేరాల సంఖ్య తగ్గింది 

22 May, 2022 04:40 IST|Sakshi

గంజాయి సాగు, రవాణాను నిరోధించాం

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

తిరుపతి క్రైం/తిరుమల: గడచిన మూడేళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ కాసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోకుండా క్రైమ్‌ రేటును గణించినట్టు చెప్పారు. శనివారం తిరుపతిలోని ఎస్వీ సెనేట్‌ హాల్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో గస్తీ పెంచడంతోపాటు నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు.

రాష్ట్రంలో యాక్సిడెంట్ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిన మాట వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నారాయణను అరెస్ట్‌ చేశామని చెప్పారు. కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏపీపీ సుజాతను సస్పెండ్‌ చేశామని చెప్పారు.

ప్రాసిక్యూషన్‌కు ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాలు ఆందోళనకరంగా లేవని, అయినా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 

గంజాయి సాగు, రవాణాను నిరోధించాం
రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. మల్కాన్‌గిరి జిల్లా నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు  తెలిపారు. నిషేధిత వస్తువులు అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్‌ పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, తిరుమల శ్రీవారిని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు.  

మరిన్ని వార్తలు