శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలలో పెరిగిన రద్దీ..

23 Sep, 2023 08:59 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా, హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులు కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఇక, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గరుడోత్సవం రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,650గా ఉంది. గరుడోత్సవం నాడు  శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్లు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,410గా ఉంది. 

ఇదిలా ఉండగా.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహ­నం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్య­క్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. 

విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్ర­మాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రా­లను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు.

శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు