Anantapur District: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?  

21 Feb, 2022 07:12 IST|Sakshi

రాష్ట్రంలో వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు 

మన జిల్లాలో 902 మంది మాత్రమే

అమ్మాయిల సంఖ్య తగ్గుతూ పోతే ప్రమాదకరమని అధికారుల హెచ్చరిక 

స్కానింగ్‌ సెంటర్లపై మరింత నిఘా 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ బర్త్‌ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు.

చదవండి: టెలీ మెడిసిన్‌ సేవల్లో ఏపీ టాప్‌

చివరి స్థానంలో అనంత.. 
అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.  

ఎందుకిలా? 
కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్‌ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్‌ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు.

ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్‌ సెంటర్‌ వైద్యుల (రేడియాలజిస్ట్‌/సోనాలజిస్ట్‌) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.  ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది.  

నిఘా మరింత పెంచాం 
జిల్లాలోని అన్ని స్కానింగ్‌ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా  లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు.  వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. 
– డాక్టర్‌ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్‌ఓ

రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. 
జిల్లా                    అమ్మాయిలు 
వైఎస్సార్‌ జిల్లా     925 
చిత్తూరు                924 
కర్నూలు               908 
అనంతపురం        902    

మరిన్ని వార్తలు