గుబాళిస్తున్న జాజికాయ, జాపత్రి!

12 Jun, 2022 05:21 IST|Sakshi
అంబయ్య చేలో సాగు చేసిన జాజికాయ మొక్కలు

కేరళలో మాత్రమే పండే పంట 

కాకినాడ జిల్లా యండపల్లి రైతు ప్రయోగం 

పామాయిల్‌ సాగులో అంతర పంటలుగా.. 

సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు 

పిఠాపురం: కేరళలో మాత్రమే పండే జాజికాయ, జాపత్రి పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు కాకినాడ జిల్లా  కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. ఉద్యానశాఖ అధికారుల సూచన మేరకు తనకున్న పామాయిల్‌ తోటల్లో అంతర పంటగా మసాల దినుసులు, వనమూలికల పెంపకం చేపట్టారు.

సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఈ పంటలను సాగు చేస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో జాజికాయల మొక్కలను తెప్పించుకుని.. ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా అంతరపంటల సాగును విజయవంతంగా సాగు చేస్తున్నారు. దేశవాలీ ఆవులను పెంచుతూ ఒక పక్క పాడితో ఆదాయాన్ని పొందుతూ.. మరో పక్క సేంద్రియ ఎరువులను తయారు చేసి మొక్కలను పెంచుతున్నారు.

పామాయిల్‌ తోటలో జాజికాయ, జాపత్రితోపాటు మిరియాలు, యర్రవాగులి (ఆయుర్వేద మొక్క), ఎర్ర చక్కెరకేళి, కంద తదితర మొక్కలు పెంచుతున్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి. మంచి దిగుబడి వస్తున్నది. దీనికి మార్కెట్‌ అవసరం లేకుండా ఆయనే స్వయంగా పండిన పంటను స్థానికంగా ఉన్న దుకాణాలకు సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.

అంబయ్య తన పొలంలో పండించే జాజికాయలలో రెండు రకాలు ఉంటాయి. కేరళశ్రీ, విశ్వశ్రీ వాటిలో కేరళశ్రీ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో జాపత్రి కేజీ  రూ.2,100 ఉండగా జాజికాయ కేజీ రూ. 900 ఉన్నాయి. 

ప్రభుత్వ సహకారం ఉంటే .. 
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముళ్ళపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయలను సాగు చేయడంతో దానిని చూసి.. నా పొలంలో సాగు చేయడం ప్రారంభించా. కొద్ది పొలంలో జాజికాయ, జాపత్రి  మొక్కలను నాటగా అన్నీ కాపు కాసి ప్రస్తుతం దిగుబడినిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కోచెట్టు ఐదు నుంచి 10 కేజీల దిగుబడినిస్తుంది. ప్రభుత్వ సహకారం ఉంటే మొత్తం ఆరు ఎకరాల్లోనూ జాజికాయ, జాపత్రి సాగు చేస్తా.  
– గుండ్ర అంబయ్య, రైతు , యండపల్లి, కొత్తపల్లి 

జాజికాయ,జాపత్రి సాగు లాభదాయకం.. 
జాజికాయ, జాపత్రి సాగు అంతరపంటగా మంచి లాభాలను ఇస్తుంది. చాలా మంది రైతులకు ఈ పంట సాగు చేయమని సూచనలు ఇస్తున్నాం. కొంత మంది రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. రైతులు తమ పొలాల్లో అంతర పంటల సాగుకు ముందుకొస్తే అసలు పంటల కంటే అంతర పంటల ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఉద్యానశాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. 
– శైలజ, ఉద్యానశాఖాధికారి, పిఠాపురం 

మరిన్ని వార్తలు