ఆహార నాణ్యతను పట్టేసే.. న్యూట్రిగ్రో యంత్రం 

9 Feb, 2022 04:27 IST|Sakshi

 విద్యార్థుల మెనూ స్కాన్‌ చేసి సీఎం డ్యాష్‌బోర్డుకు నివేదికలు 

రామవరప్పాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో అందించే ఆహార నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించే ప్రక్రియలో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్రంలోనే తొలిసారిగా న్యూట్రిగ్రో యంత్రాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది.

ఈ యంత్రం ద్వారా పాఠశాలలో వండి, వడ్డించే ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, వేడిగా ఉన్నప్పుడే వడ్డిస్తున్నారా, మెనూ పాటిస్తున్నారా, ఒక్కో విద్యార్థికి ఎంత మొత్తంలో క్యాలరీలు అందుతున్నాయి, విద్యార్థుల ఎత్తు, బరువు, ఆరోగ్యం ఎలా ఉంది ఇలా ప్రతి అంశాన్ని ఈ యంత్రం స్కాన్‌ చేసి ఎప్పటికప్పుడు నేరుగా ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుకు నివేదిక పంపిస్తుంది. నిడమానూరు జెడ్పీ పాఠశాలలో  ఈ న్యూట్రిగ్రో మిషన్‌ను మంగళవారం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో ఒక్కో విద్యార్థిని ఫేస్‌ రికగ్నైజ్‌డ్‌ ప్రక్రియ ద్వారా ఈ మిషన్‌ పరిశీలించి ప్లేటులో ఉన్న ఆహార పదార్థాలు వాటి నాణ్యత, మెనూ ప్రకారం ఉన్నాయో లేదో స్కాన్‌ చేస్తుంది. విద్యార్థులకు క్యాలరీస్‌ ఎంత అందుతున్నాయో అంచనా వేసి సీఎమ్‌ డ్యాష్‌ బోర్డుతో పాటు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తుంది.  

న్యూట్రీగ్రో యంత్రాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్న సిబ్బంది  

మరిన్ని వార్తలు