అందాల దీవికి 'ఆపద'!

2 Sep, 2021 05:14 IST|Sakshi
చిన్న గొల్లపాలెం దీవివైపు దూసుకొస్తున్న సముద్రం

సహజసిద్ధ అందాలకు కొదవలేని చినగొల్లపాలెం దీవి

దీవి వైపు దూసుకొస్తున్న సాగరం

కొబ్బరి తోటలను కబళిస్తున్న వైనం

రాతి కట్టడం నిర్మించి ఆదుకోవాలంటున్న జనం

సాక్షి, ప్రతినిధి విజయవాడ/ కృత్తివెన్ను: ఆరువేల ఎకరాల పైచిలుకు భూభాగం.. మూడు వైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం.. నాలుగువైపులా నీటితో సుందరమైన సహజ అందాలకు కొదవేలేదు.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న చినగొల్లపాలెం దీవికి సాగరుని రూపంలో ప్రస్తుతం ఆపద ముంచుకొస్తుంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దుగా ఉంటూ రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతున్న ఈ దీవిపై విశ్లేషణాత్మక కథనం... 1962వ సంవత్సరానికి ముందు వరకు దీవి మూడు వైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962వ సంవత్సరంలో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ (కొత్తకాలువ) తవ్వారు. దీంతో అప్పటి నుంచి సహజసిద్ధ ద్వీపకల్పం మానవ నిర్మిత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు దీవికి బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తరువాత కాలంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై వారధి నిర్మించడంతో చినగొల్లపాలెం దీవి వాసులకు రోడ్డుమార్గం ద్వారా రవాణా సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి.

ప్రమాదం అంచున దీవి.. 
ఆరువేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో పాటు, పదివేల జనాభా కలిగిన దీవిలో ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది. ప్రస్తుతం  దీవిని రెండు వైపులనుంచి సముద్రం పెద్ద ఎత్తున కోతకు గురిచేయడంతో ప్రజల్లో తీవ్ర భయాం దోళనలు నెలకొన్నాయి.  ఇప్పటికే దా దాపు ఎనిమిది వందల ఎకరాల వరకు సరుగు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసి కనుమరుగైపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కోత నివారణకు పూడికతీత.. 
ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా విలసిల్లే దీవి మనుగడ ప్రమాదంలో ఉంది. 1986, 2004–06 సంవత్సరాల మధ్య కాలంలోనూ ఇక్కడ పూడిక తీత పనులు చేశారు. అప్పట్లో కొంతమేర కోత ఆగినా..తిరిగి మళ్లీ ఇప్పుడు మరింత వేగంగా కోత కోస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీవి కోత నివారణకు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా కోత ప్రదేశంలో రాతి కట్టడం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు

పూడిక  తీయకపోతే దీవి కనుమరుగే 
సముద్రం వేగంగా దీవిని కోతకు గురిచే స్తుంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకు పోవడమే.వెంటనే సముద్ర ముఖద్వారం వద్ద పూడికను తీయకపోతే పెను ప్రమాదమే.
–కొక్కిలిగడ్డ బాపూజీ, మాజీ సర్పంచ్‌ చినగొల్లపాలెం 

ఇలాగే కొనసాగితే భారీ నష్టమే
గ్రామాన్ని సముద్రం కోతకోస్తూ ఊరివైపు దూసుకొస్తుంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది.
–మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షులు 

కోత నివారణకు ప్రతిపాదనలు.. 
చినగొల్లపాలెం దీవి కోత నివారణకు సీ కోస్టల్‌ ఏరియా (ప్రొటెక్షన్‌కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపాం. దీంతో పాటు కొత్తకాలువ, పాత కాలువల పూడికతీత రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాతకాలువపై రెగ్యులేటర్‌కు రూ.364కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేట ర్‌కోసం రూ.166.35 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– సుబ్రమణ్యేశ్వరరావు, డ్రైనేజీ డీఈఈ  

మరిన్ని వార్తలు