7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం

5 Oct, 2021 04:31 IST|Sakshi

రోజుకు వెయ్యి మంది వెనుకబడిన వర్గాలకు అవకాశం

13 జిల్లాల నుంచి ఉచిత బస్సులు

శ్రీవారి దర్శనానికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లేదా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించనున్నారు. హిందూ ధర్మ ప్రచారం, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే.

ఆయా ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన వర్గాల భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురానున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గం మధ్యలో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది.

దర్శన టికెట్లు ఉంటేనే అనుమతి
దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. కోవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ గానీ, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టు గానీ తప్పనిసరిగా తీసుకురావాలని సోమవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తుండడంతో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నామని తెలిపింది.

ఇతర ఆలయాల్లోనూ టీటీడీ విధానాలు!
9 కమిటీలతో అధ్యయనం
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీలో అమలు చేస్తున్న విధానాలను.. దేవదాయ శాఖ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్‌ అధ్యక్షతన వారం కిందట జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల మేరకు దేవదాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది.

ఆన్‌లైన్‌లో పూజ టికెట్ల జారీ, బంగారు ఆభరణాల డిజిటలైజేషన్, నిర్వహణ, ఆలయ భద్రత, అవసరమైన సామగ్రిని పారదర్శకంగా కొనుగోలు చేయడం తదితర అంశాలపై దేవదాయ శాఖలో పనిచేసే కీలక అధికారులతో 9 కమిటీలను ఏర్పాటు చేస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా కమిటీల్లోని సభ్యులు 2 విడతల్లో తిరుమల ఆలయాన్ని సందర్శించి.. టీటీడీలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నెల 5–9 తేదీల మధ్య 4 బృందాలు, 18–22 తేదీల మధ్య 5 బృందాలు తిరుమల సందర్శనకు వెళ్లాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు