మమ్మల్ని ఆంధ్రా వాసులుగా గుర్తించండి 

9 Jul, 2021 04:37 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన బాగుంది 

మాకూ పథకాలు వర్తింపజేయాలి 

ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజల వినతి

పాచిపెంట: తామంతా తెలుగువారమేనని.. ఒడిశా ప్రభుత్వం తమ పల్లెలను అక్రమంగా ఆ రాష్ట్రంలో కలిపేసిందని, మళ్లీ తమను ఆంధ్రాలో చేర్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీవో కూర్మనాథ్‌కు గురువారం విన్నవించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీకి సమీపంలో ఒడిశా పరిధిలో ఉన్న కరిడి, పిలకబిట్రా, బిట్రా, జంగంవలస, అడ్డబొడ్డవలస, బొర్రమామిడి, బైరిపాడు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు పి.కోనవలసలో ఎమ్మెల్యే, పీవోలను కలిశారు.

తమ తండ్రులు సాలూరు మండలం సారికి గ్రామానికి చెందిన దివంగత ఎంపీ డిప్పల సూరిదొరకు  శిస్తు చెల్లించేవారన్నారు. వాటికి సంబంధించిన రాగి ఒప్పంద పత్రాలను చూపించారు. ఒడిశా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలు కూడా తీరని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన బాగుందని, తమను కూడా ఆంధ్రా ప్రజలుగా గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు.  సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రాజన్నదొర వారికి హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు