ఆంధ్రా–ఒడిశా మధ్య.. 'పంచాయతీ' చిచ్చు!

10 Feb, 2021 04:42 IST|Sakshi
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని కొటియా ప్రాంతం (ఇన్‌సెట్‌లో) ఒడిశా ఏర్పాటు చేసిన బోర్డు

కొన్నేళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య తేలని కొటియా వివాదం 

‘సాక్షి’ కథనాలతో ఏపీ సర్కార్‌ సంక్షేమ పథకాల అమలు 

దీంతో ఒడిశా కూడా రంగంలోకి.. 

టీడీపీ హయాంలో గాలికొదిలేసిన నాటి పాలకులు 

తాజాగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయొద్దంటున్న ఒడిశా 

ఓటర్లపై దౌర్జన్యం చేస్తున్న ఆ రాష్ట్ర అధికారులు 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దని ఒడిశా ప్రభుత్వం ఓటర్లను బెదిరిస్తోంది. ఈ విషయం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగులుచెన్నేరు, కురుకూటి, గంజాయిభద్ర, సారిక పంచాయతీల్లో 23 గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొటియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను మూడేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఏపీకి చెందిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాథమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా కూడా అభివృద్ధి మంత్రంతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు రూ.180 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టింది. 

వాటిపై అంత ప్రేమ ఎందుకంటే.. 
కొటియా పల్లెలు అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆరి్థకంగా ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్న ప్రచారం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని పార్లమెంటు కమిటీ అధ్యయనం చేస్తోంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. అందువల్ల అక్కడి గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా విస్మరించింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కొటియా ప్రజలకు కొత్త జీవితం మొదలైంది. సంక్షేమ పథకాలు వారికి చేరువవుతున్నాయి. దీంతో వారు మళ్లీ ఆంధ్రాపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

ఏపీలో ఎన్నికలతో రాజుకుంటున్న వివాదం 
కొటియా గ్రూప్‌లోని గంజాయిభద్రలో 13 గ్రామాలున్నాయి. పట్టుచెన్నేరులో నాలుగు, పగులుచెన్నేరులోని మూడు, సారికలో ఒకటి, కురుకూటిలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇప్పుడు ఒడిశా సర్కారు పోలీసులను ఈ గ్రామాల్లో దించింది. ఆంధ్రా ఎన్నికలకు వెళ్లొద్దని బెదిరిస్తోంది. సాలూరు తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పార్వతి పోలీసు బలగాలతో అక్కడకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్కడివారిని కోరారు.  

సుప్రీంకోర్టుకు వెళ్తా 
కొటియా గ్రామాల్లో ఓటర్లపై ఒడిశా అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓటు వేయకుండా అడ్డుకోవాలని చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడను. మా ప్రాంతానికి వచి్చనపుడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకువెళ్లాను. తాజా పరిస్థితిని సీఎం జగన్‌ దృష్టికీ తీసుకెళ్తా. 
– పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే 

చూస్తూ ఊరుకోం 
కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చేస్తున్నాం. గిరిజనులకు మంచి జరుగుతుందనే కారణంతో ఒడిశా కార్యక్రమాలను అడ్డుకోలేదు. అంతమాత్రాన ఓటు వేయనీయకపోతే చూస్తూ ఊరుకోం. మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్‌ 

ప్రశాంత ఎన్నికలకు చర్యలు 
కొటియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. మేం అక్కడి ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. త్వరలోనే వారందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించడానికి ఏర్పాట్లుచేశాం. ఒడిశా చర్యలు సరైనవి కావు. 
– ఆర్‌. కూర్మనాథ్, పార్వతీపురం ఐటీడీఏ పీఓ  

మరిన్ని వార్తలు