Mee Seva: మీ సేవ.. ఇదేం తోవ!

10 Jul, 2021 12:05 IST|Sakshi

ఆధార్‌.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అర్హులందరికీ పథకాల లబ్ధిని అందిస్తోంది. ఈనేపథ్యంలో ఆధార్‌ కార్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆధార్‌ కార్డుల్లో మార్పులతో అడ్డదారిలో ప్రయోజనాలు పొందుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్‌ అనుమతులు ఇచ్చింది. అయితే జిల్లాలో మీ సేవ కేంద్రాలను పరిశీలించే ఉన్నతాధికారి ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహించే సెంటర్లకు ఆధార్‌ అనుమతులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశం అయ్యింది.   

సాక్షి, ఏలూరు: జిల్లాలో మీసేవ కేంద్రాలను పరిశీలించే ఒక అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విధానాలకు తూట్లుపొడుస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అందే సేవలను ప్రైవేటుగా నడిచే కొన్ని మీ సేవ కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మీ సేవ కేంద్రాలకు ఆధార్‌ అనుమతులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్‌ అనుమతులు ఉన్నాయి. యూఐడీఏఐ నిబంధనల మేరకు బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే మీ సేవ కేంద్రాలకు మాత్రమే ఆధార్‌ సెంటర్లకు అనుమతులు ఇస్తున్నారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోను ఆధార్‌ సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రైవేట్‌ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవని తేల్చి చెప్పింది.  

అప్పట్లో వద్దన్నారు.. మళ్లీ ప్రతిపాదనలు 
ప్రైవేటు వ్యక్తులు నడిపే ఆధార్‌ సెంటర్లకు ప్రభుత్వ భవనాలు కేటాయించడం కుదరదని గత కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తేల్చిచెప్పారు. ముత్యాలరాజు జిల్లా నుంచి బదిలీ కావడం కొత్తగా కార్తికేయ మిశ్రా బాధ్యతలు చేపట్టడంతో మరోమారు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు నిర్వాహకులకు ఆధార్‌ అనుమతులు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు.  

2013 నుంచి జిల్లాలోనే.. 
వాస్తవానికి మీ సేవ కేంద్రాలు పరిశీలించే ఉన్నతాధికారి మూడేళ్లకు మించి ఒకేచోట విధులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాకు చెందిన ఉన్నతాధికారి 2013 నుంచి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు. జిల్లా నుంచి బదిలీపై వెళితే జీతం పెరిగే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ఇక్కడ నుంచి కదలడం లేదు. జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని అజమాయిషీ చేస్తున్నారు. సదరు అధికారి కాంట్రా క్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తూ.. తహసీల్దార్‌ స్థాయి అధికారులతోనే దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టారీతిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి.

ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు మాత్రమే ఆధార్‌ అనుమతులు ఉండటంతో, కొందరు ప్రైవేట్‌ మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు ధ్రువీకరణ పత్రాలు          పుట్టించి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. 
ఇందుకు జిల్లాస్థాయి మీ సేవ కేంద్రాల ఉన్నతాధికారి ముడుపులు తీసుకుంటూ దస్త్రాన్ని సిద్ధం చేశారు.  
పంచాయతీ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాలు లేకుండానే ఉన్నట్టు ఇప్పటికే కొందరు సిబ్బంది ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేశారు.  
వీటిని ఆసరాగా తీసుకుని ఉన్నతాధికారి ఆధార్‌ కేంద్రాల అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  
ఈ అనుమతులు లభిస్తే జిల్లాలో మరోమారు ఆధార్‌ కార్డుల్లో వయసు తారత మ్యాలు, మార్పులు సులభంగా జరిగే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు