‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం

28 Apr, 2021 04:19 IST|Sakshi
శ్రీగంగా వాటర్‌ప్లాంట్‌లో సీజ్‌ చేసిన వాటర్‌ ప్యాకెట్లు

అనధికార వాటర్‌ ప్లాంట్లపై దాడులు

విజయవాడలో వేలాది బాటిళ్లు సీజ్‌

ప్లాంట్లను సీజ్‌ చేసేందుకు సిఫారసు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న తనిఖీలు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్‌ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబొరేటరీస్‌ అండ్‌ ఫుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్‌ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్‌ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్‌ ప్లాంట్‌లను జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. 

ప్లాంట్ల సీజ్‌: బ్లూ వాటర్‌ ప్లాంట్‌కు బీఐఎస్‌/ఐఎస్‌ఐ లైసెన్స్‌లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్‌ ప్రాసెసింగ్, ప్యాకింగ్‌ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్‌ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్‌ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్‌ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు.
విజయవాడ పటమటలోని బ్లూ వాటర్‌ ప్లాంట్‌లో అధికారుల తనిఖీలు  

ఈ ప్లాంట్‌లో ఉన్న 6,125 సీల్డ్‌ వాటర్‌ బాటిళ్లను సీజ్‌ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్‌ ప్లాంట్‌లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్‌ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్‌ చేసి నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు శేఖర్‌రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్‌ సీఐ అశోక్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్‌ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ స్వరూప్‌ చెప్పారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు