సిలబస్‌ సర్దుబాట

12 Oct, 2020 03:15 IST|Sakshi

కోవిడ్‌తో ఇప్పటికే విద్యా సంవత్సరంలో నాలుగు నెలలు కోల్పోయిన వైనం

పాఠశాలల పనిదినాలను అనుసరించి సిలబస్‌ ఖరారుపై అధికారుల దృష్టి

ఇప్పటికే సీబీఎస్‌ఈ 50 శాతం సిలబస్‌ కుదింపు

11, 12 తరగతుల్లోనూ 30% కోత

30% సిలబస్‌ తగ్గించిన ఇంటర్‌ బోర్డు

ఉన్నత విద్యలో యూజీసీ సూచనల మేరకు చర్యలు

తల్లిదండ్రుల అభిప్రాయాలకూ ప్రాధాన్యం

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యాసంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలల సమయాన్ని కోల్పోవడంతో పాఠ్యప్రణాళికల పునర్వ్యవస్థీకరణపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేపట్టారు. విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి.. ఎన్ని పనిదినాలు ఉంటాయన్న అంశాల ఆధారంగా సిలబస్‌ను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ క్యాలెండర్, పాఠ్యప్రణాళికల రూపకల్పనపై దృష్టి సారించారు. కోవిడ్‌ వల్ల స్కూళ్లు మార్చి నుంచి మూతపడడంతో 2019–20 విద్యాసంవత్సరంలో చివరి పరీక్షలు నిర్వహించలేకపోయారు.

– 2020–21 విద్యాసంవత్సరం జూన్‌ 12 నుంచి ప్రారంభం కావలసి ఉన్నా కోవిడ్‌ కారణంగా సాధ్యంకాలేదు. సెప్టెంబర్‌ 5నుంచి ఆపై అక్టోబర్‌ 2నుంచి తెరవాలని చూసినా కేంద్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.
– తాజాగా నవంబర్‌ 2 నుంచి తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి స్కూళ్లు తెరవనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇప్పటికే చెప్పారు.
– స్కూళ్లను ఎప్పటినుంచి తెరవాలి, విద్యార్థులను ఎలా రప్పించాలనే విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదించారు.
–  దాదాపు అయిదు నెలల కాలం నష్టపోతున్నందున ఈ సమయాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి, వేసవి సెలవుల్లోనూ  తరగతులను కొనసాగిస్తే కొన్నిరోజులు సర్దుబాటవుతాయని భావిస్తున్నారు. 
– ఎన్ని పనిదినాలు ఉంటాయో తేలితే ఆమేరకు సిలబస్‌ను కుదించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణమండలి డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు.
తమ విద్యార్థులకు 50 శాతం మేర సిలబస్‌ తగ్గించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది.
– 11, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్‌ఈ 30 శాతం మేర సిలబస్‌ కుదించింది. ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా అదే మాదిరి సిలబస్‌ను కుదించి వెబ్‌సైట్లో ఉంచింది.

యూజీసీ మార్గదర్శకాల మేరకు డిగ్రీ సిలబస్‌
– యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలను అనుసరించి ఉన్నత విద్యలో డిగ్రీ తదితర కోర్సుల్లో సిలబస్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. 
– తొలుత కాలేజీలను నవంబర్‌ 2 నుంచి తెరవాలన్న యూజీసీ ఇప్పుడు నవంబర్‌ 18 నుంచి తెరవాలని ఆదేశించింది. 
– పనిదినాలు తగ్గకుండా సర్దుబాటు చేసుకోవాలని, విద్యాసంవత్సరాన్ని ఆగస్టు చివరి వరకు కొనసాగించవచ్చని పేర్కొంది.
– డిగ్రీలో ఒక సెమిస్టర్‌కు 90 రోజుల చొప్పున ఏడాదికి 180 పనిదినాలు ఉండాలి. ఆగస్టు వరకు విద్యాసంవత్సరం కొనసాగిస్తే పనిదినాలు సరిపోవచ్చని, సిలబస్‌ కుదింపు అవసరం లేకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  

>
మరిన్ని వార్తలు