ఫీజులు కావాలి గానీ.. వసతులు కల్పించలేరా?

22 Feb, 2021 08:30 IST|Sakshi
క్యాంపస్‌ ప్రాంగణంలోని టాయిలెట్ల నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరించలేక ముక్కు మూసుకున్న కమిషన్‌ సభ్యులు

గుంటూరు నారాయణ జూనియర్‌ కాలేజీ తీరుపై అధికారుల ఆగ్రహం

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌

కాలేజీ యాజమాన్యానికి నోటీసు ఇస్తున్నట్లు వెల్లడి  

గుంటూరు ఎడ్యుకేషన్‌: ‘విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. కనీస వసతులు కూడా కల్పించరా’ అంటూ నారాయణ జూనియర్‌ కాలేజీపై ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు శివారులోని పెదపలకలూరులో ఉన్న నారాయణ జూనియర్‌ కాలేజీ హాస్టల్‌ క్యాంపస్‌లో కమిషన్‌ సభ్యులు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యాంపస్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో టమోటాలు, క్యాబేజీ సహా కుళ్లిన కూరగాయలను అలాగే ఉంచడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

వేలాది రూపాయలు వసూలు చేస్తూ.. విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ సిబ్బందిని నిలదీశారు. తమ పిల్లలకు సరైన సదుపాయాలను కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఈ సందర్భంగా వాపోయారు. కమిషన్‌ సభ్యులు స్పందిస్తూ.. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ఆటవిడుపు కూడా లేకుండా తరగతులకే పరిమితం చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

‘విద్యార్థులకు వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరా? ఏడు రోజుల పాటు ఉదయం 7 నుంచి రాత్రి 9.30 వరకు తరగతులు నిర్వహిస్తారా!’ అంటూ కమిషన్‌ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌ఐవో కార్యాలయంలో కమిషన్‌ సభ్యులు నారాయణరెడ్డి, ప్రసాద్, ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే.. కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు 40 కాలేజీలకు నోటీసులు జారీ చేశామన్నారు. జూనియర్‌ కాలేజీల నిర్వహణను ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఆర్‌ఐవో రామచంద్రరావు పనితీరు సరిగాలేదన్నారు.
చదవండి: నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు