పెట్రో...కనికట్టు

12 Sep, 2020 07:10 IST|Sakshi
నగరంలోని ఓ పెట్రోలు బంకులో యంత్రాన్ని పరిశీలిస్తున్న తూనికలు, కొలతల శాఖ డీసీ కృష్ణ చైతన్య, సిబ్బంది (ఫైల్‌)

పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారుల నిర్లక్ష్యం 

వాహనదారుడికి శాపం! 

అడపాదడపా తనిఖీలతో మమ 

ఏడాదిన్నరలో చేసినవి 173! 

సాక్షి, అమరావతి బ్యూరో: తరచూ పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు అటువైపే చూడటం లేదు. ఒకవేళ తనిఖీలు చేపట్టినా ఒకటి, రెండు బంకుల్లో హడావిడి చేసి తర్వాత మమ అనిపిస్తున్నారు. అంతా చమురు సంస్థలే చూసుకుంటాయంటూ చేతులెత్తేస్తున్నారు. ఆయా శాఖాధికారుల వద్ద మీ పరిధిలో ఎన్ని బంకులున్నాయి.. ఈ ఏడాది తనిఖీ చేసినవెన్ని? అనే కనీస సమాచారం కూడా లేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  

జిల్లావ్యాప్తంగా 307 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఇందు లో బీపీసీఎల్‌ కంపెనీకి చెందిన 56 బంకులు, హెచ్‌పీసీఎల్‌కు చెందినవి 91, ఐఓసీకి చెందినవి 124, ఈసర్‌ కంపెనీవి 04, వినియోగదారుల పంపులు 32 ఉన్నాయి. ప్రతి బంకుల్లోని పంపులకు ఇంధన కొలతలను ధ్రువీకరిస్తూ తూనికలు, కొలతల శాఖ అధికారులు సీల్‌ వేసి, స్టాంపింగ్‌ చేస్తారు. ఇలా ప్రతిఏటా బంకు నిర్వాహకులు పంపులకు స్టాంపింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఐదు లీటర్ల ఇంధనానికి 25 మిల్లీలీటర్ల తరుగును మాత్రమే చట్టం అనుమతిస్తుంది. ఈ లెక్కన లీటరుకు 5 మిల్లీ లీటర్ల తరుగు మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఎలాంటి అవకతవకలకు పాల్పిడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా బంకులను సీజ్‌ చేస్తారు.  

లీటరుకు 30 మిల్లీ లీటర్లు తక్కువ 
ఇంధనం పోసే యంత్రాల్లో కొందరు బంకుల నిర్వాహకులు ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లను అమర్చి వాహనదారులను నిండా ముంచుతున్న వైనాన్ని తాజాగా తెలంగాణ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. లీటరు ఇంధనానికి 970 మిల్లీ లీటర్లు వాహనంలో కొట్టగానే లీటరు కొట్టినట్లుగా పాయింట్లు చూపిస్తుంది. ఇలా వినియోగదారుడు 30 మిల్లీ లీటర్ల ఇంధనాన్ని నష్టపోతున్నాడు. ఇలా నిర్వాహకులు ప్రతిరోజు సగటున రూ.లక్ష వరకు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇలాంటి బంకులను ఆంధ్రప్రదేశ్‌లో 22 సీజ్‌ చేశారు.  

ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం..? 
బంకుల నిర్వాహకులు రికార్డుల్లో చూపుతున్నట్లు ఇంధనం నిల్వలున్నాయా.. లేదా? నిర్వహణ, వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులది. పెట్రోల్, డీజిల్‌ను సరిగ్గా నింపుతున్నారా? ఇంధనం పోసే యంత్రాలు సక్రమంగానే ఉన్నాయా.. అక్రమాలేమైనా చోటు చేసుకుంటున్నాయా? అని తూనికలు, కొలతల శాఖాధికారులు తనిఖీ చేయాలి. బంకుపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత సంబంధిత చమురు సంస్థది. పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు ఏడాదిన్నరగా 173        బంకుల్లో తనిఖీలు చేసి ఊరుకున్నారు.  

ఇలా చేస్తే మేలు...  
ప్రస్తుతం తూనికలు, కొలతల అధికారులు మదర్‌ బోర్డు, ఇంటిగ్రేటెడ్‌ చిప్‌కు మాత్రమే సీల్‌ వేస్తున్నారు. అలా కాకుండా రీడింగ్‌ బోర్డు సహా ïసీల్‌ వేయాలి. మరమ్మతుల నిమిత్తం ఓటీపీ ఉంటేనే తెరుచుకునేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. సంబంధిత అధికారులు, సిబ్బంది వేలి ముద్ర వేస్తేనే యంత్రాలను తెరిచేలా ఏర్పాట్లు చేయాలి.  

మోసాలకు పాల్పడితే బంకు సీజ్‌ చేస్తాం   
పెట్రోలు బంకుల్లో ఇంధన కొలతల్లో నిర్వాహకులు ఎలాంటి మోసాలకు పాల్పడినా నేరమే అవుతుంది. వినియోగదారులు జేబులు చిల్లులు పెట్టేలా ఎవరూ వ్యవహరించినా ఉపేక్షించం. అటువంటి బంకులను సీజ్‌ చేస్తాం. నిర్దేశిత సమయంలోపే బంకులకు స్టాంపింగ్‌ చేస్తున్నాం. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 173 బంకులను తనిఖీలు చేశాం. 16 బంకులపై కేసులు నమోదు చేసి.. రూ. 2.27 లక్షలు జరిమానా విధించాం.  
– ఎ.కృష్ణ చైతన్య, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా