భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదు 

26 Nov, 2020 04:20 IST|Sakshi
విశాఖ జిల్లా రాజయ్యపేటలో ప్రజాభిప్రాయసేకరణ సదస్సు నిర్వహిస్తున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి

నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై ప్రజాభిప్రాయ సదస్సులో అధికారులు

సాక్షి, విశాఖపట్నం: భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ పరిహారం విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. విశాఖ జిల్లాలోని నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై బుధవారం రాజయ్యపేట వద్ద  ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డితో పాటు నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారి షేక్‌ సుభాన్‌ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్ తో పాటు స్థానికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పార్కు ఏర్పాటును స్వాగతించారు. పర్యావరణ కాలుష్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ పరిహారానికి సంబంధించి ఇంకా కొందరికి బకాయిలు చెల్లించాల్సి ఉందని.. కొన్నిచోట్ల ఇళ్లకు, చెట్లకు తక్కువ పరిహారమిచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి కూడా నష్టపరిహారమివ్వాలని కోరారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి జేసీ హామీ ఇచ్చారు. నక్కపల్లి మండలంలో భూ సేకరణ జరిగిన బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డీఎల్‌ పురం, రాజయ్యపేట గ్రామాల్లో పరిహారం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. 

మరిన్ని వార్తలు