-

అన్నదాతలకు చకచకా చెల్లింపులు

16 Jan, 2021 04:46 IST|Sakshi

ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి కోట్లు రైతుల ఖాతాల్లో జమచేస్తున్న అధికారులు 

రూ.5 వేలకోట్ల రుణానికి కూడా పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం గ్యారంటీ 

గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇతర పథకాలకు పౌరసరఫరాల సంస్థ నిధుల మళ్లింపు 

సాక్షి, అమరావతి: రైతులకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాతల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేయడం కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయడంతో రైతులకు ఊరట లభించినట్లైంది. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని అప్పట్లో పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత నిర్ణీత వ్యవధిలోగా వారికి డబ్బులు చెల్లించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరి్థకశాఖ విడుదల చేసిన రూ.వెయ్యి కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

డిసెంబర్‌ చివరి నాటి వరకు ధాన్యం సేకరించిన రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు చెందిన నిధులను సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో అప్పటి నుంచి రైతులకు ధాన్యం బిల్లులు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత పౌరసరఫరాల సంస్థ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా చెల్లింపులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు రోజుల కిందట ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేయడంతో ఇటు రైతులకు, అటు అధికారులకు మేలు కలగనుంది. 

రోజుకు రూ.160 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు 
ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 1వ తేదీ నుంచి మరింత పెరిగాయి. రోజుకు రూ.160 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు 23.99 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే రూ. 2,447.90 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ధాన్యానికి కూడా సకాలంలో జమ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రూ.ఐదువేల కోట్ల రుణం తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ మొత్తానికి గ్యారంటీ కూడా ఇచ్చింది.   

మరిన్ని వార్తలు