విచారణలోనూ మ'మేకా'మై..

18 Aug, 2020 08:04 IST|Sakshi
సొసైటీ కార్యాలయంలో కూర్చున్న విచారణ అధికారుల బృందం, వేములదీవి మ్యాక్‌ సొసైటీ కార్యాలయం

వేములదీవి మ్యాక్‌ సొసైటీపై మరోమారు విచారణ 

సొసైటీ అధ్యక్షుడు మేకా మాయాజాలం 

రైతులు హాజరు కాకుండా కార్యాలయంలో తిష్ట 

విచారణతీరుపై సర్వత్రా అభ్యంతరం  

నరసాపురం: వేములదీవి మ్యాక్‌ సొసైటీ పరిధిలోని రైతులను  25 ఏళ్లుగా మోసం చేస్తూ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ఇచ్చే సొమ్మును కాజేస్తూ కోట్ల కుంభకోణానికి పాల్పడిన అక్రమార్కులపై విచారణ కొనసాగుతోంది. తాజాగా సోమవారం  గ్రామంలోని సొసైటీ కార్యాలయానికి విచారణ అధికారిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా సహకారశాఖ డీఆర్‌ (కాకినాడ) కె.కృష్ణశృతి, విచారణ అధికారుల బృందంలోని కృష్ణకాంత్, లక్ష్మీశ్రీలతలతో కలిసి విచారణ జరిపేందుకు వచ్చారు. మొత్తం 138 మంది రైతులకు నోటీసులు ఇచ్చి సెక్షన్‌ 29 ప్రకారం విచారణ చేపట్టారు. అయితే విచారణలోనూ సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ మాయాజాలం కనిపిస్తోంది. (‘మేకా’ వన్నె పులి)

కేవలం రైతులు మాత్రమే విచారణకు రావాల్సి ఉండగా, సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ కూడా ఉదయమే కార్యాలయానికి వచ్చి కూర్చున్నారు. దీంతో రైతులు భయపడి విచారణకు హాజరుకాలేదు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, ఫిర్యాదుదారుడు పెన్మెత్స సుబ్బరాజు విచారణ అధికారులను నిలదీశారు. విచారణ జరుగుతున్న సమయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న సొసైటీ అధ్యక్షుడు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. అయితే దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పలేదని సుబ్బరాజు ఆరోపించారు. గొడవ పెద్దదవుతున్న విషయాన్ని గమనించి మేకా సత్యనారాయణ అక్కడి నుంచి కొంతసేపటి తరువాత జారుకున్నారు. మొత్తంగా విచారణకు రైతులు ఎవరూ హాజరుకాలేదు.   

మేకా కొమ్ముకాస్తున్న అధికారులు ? 
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, సొసైటీ ఉద్యోగికి  మరణానంతరం జీతాలు చెల్లించినట్లు చూపించడం, హమాలీ చార్జీల రూపంలో డమ్మీ వ్యక్తికి రూ.20 లక్షలు చెల్లింపు, మరో ఉద్యోగి పెద్ద మొత్తంలో సొసైటీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించనట్లు చేయడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకుండా రైతులను నష్ట పోయేలా చేయడం, ఏటా లాభాలు ఆర్జిస్తున్నా సంఘ సభ్యులకు డివిడెండ్‌ను పంచకపోవడం తదితర ఆరోపణలతో కూడిన ఫిర్యాదును రైతులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా విచారణ జరుగుతోంది. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా కూడా టీడీపీ పెద్దల సహకారంతో మేకా వాటిని బయటకు రానివ్వలేదు.

ప్రస్తుతం జరుగుతున్న విచారణ కూడా మేకా తనకున్న పలుకుబడితో పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోప్యంగా ఉంచాల్సిన విచారణ వివరాలను సహకారశాఖ అధికారులు మేకా సత్యనారాయణకు కొమ్ముకాస్తూ అతనికి  సమాచారం ఇస్తున్నారని, అతను గతంలో మాదిరిగానే రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకు నేరుగా వెళ్లి విచారించాల్సిన అధికారులు సొసైటీ కార్యాలయానికి రైతులను పిలిచి, మళ్లీ అక్కడకు సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ వచ్చి తిష్టవేసినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మళ్లీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని మాజీ సర్పంచ్‌ సుబ్బరాజు చెప్పారు. దీనిపై విచారణ అధికారి కె.కృష్ణశృతి వివరణ ఇస్తూ సొసైటీ అధ్యక్షుడు ఉదయం వచ్చి తనను కలిసి వెళ్లారని అంతకు మించి ఏమీ లేదని పేర్కొన్నారు. విచారణ సవ్యంగానే సాగుతోందని, తుది దశలో ఉందని చెప్పారు. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించిన ఈ వ్యవహారంలో అధికారుల తప్పులు బయటపడితే  వారు చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు