అప్పుడలా.. ఇప్పుడిలా!?

24 Oct, 2020 05:36 IST|Sakshi

కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన కమిషన్‌

ఇప్పుడు రోజూ 4 వేల కేసులొస్తున్న వేళ ఎన్నికల నిర్వహణపై చర్చ 

రాజకీయ పార్టీలతో భేటీ ప్రకటనపై సర్వత్రా ఆశ్చర్యం 

అనుమానాలు, విమర్శలకు తావిచ్చేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాలు

2018 నుంచి కాలయాపన చేసి, విపత్కర పరిస్థితుల్లో హడావుడి

ఈవీఎంలతో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు.. బ్యాలెట్‌తో జరిగే స్థానిక ఎన్నికలకు పోలికా!

కరోనా నేపథ్యంలో బ్యాలెట్‌తో ఎన్నికలు ప్రమాదం అంటున్న అధికారులు

ఎంపీటీసీల్లో 19 శాతం, జెడ్పీటీసీల్లో 23 శాతం మంది ఇప్పటికే ఏకగ్రీవం

వాటిని రద్దు చేసే అవకాశమే లేదంటున్న నిపుణులు

మిగిలిన వాటిని రద్దు చేయాలంటే పోటీ చేసే అభ్యర్థులందరి అభిప్రాయాలు తప్పనిసరి

రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన సమయంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్‌ ముందుకు రాలేదు. ఎవరినీ సంప్రదించకుండా వాయిదా వేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమపడి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించినప్పటికీ ప్రస్తుతం రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నాయి. 31 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళుతూ పోలింగ్‌కు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈవీఎం మిషన్లతో జరిగే బిహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను.. బ్యాలెట్‌ పేపరుతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెట్టి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో తిరిగి ఎన్నికల ఆలోచన చేయడం విడ్డూరమే. 

ఈవీఎం.. బ్యాలెట్‌కు ఎంతో తేడా
► ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ సమయంలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకునే వీలుంటుంది. బ్యాలెట్‌ ఎన్నికలలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు మొదలు పోలింగ్, కౌంటింగ్‌ వరకు వివిధ దశల్లో ఒక్కో బ్యాలెట్‌ పేపరు అనేక మంది చేతులు మారే అవకాశం ఉంటుంది.
► ఈ నేపథ్యంలో ఆ పేపరుకు ఏ దశలోనూ శానిటైజ్‌ చేసే అవకాశం ఉండదు. పైపెచ్చు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే గ్రామ, వార్డు స్థాయిలో జరిగే మండల, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇంటింటి ప్రచారం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. 
► ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియతో పోల్చితే స్థానిక ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అటు ఓటర్లతో పాటు ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మార్చి 15వ తేదీన ఎన్నికలు వాయిదా వేస్తూ.. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఎన్నికల రద్దుకు అవకాశమే లేదు
► ఎన్నికలు వాయిదా పడ్డ మార్చి 15వ తేదీ నాటికి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ తర్వాత మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాల్లో 126 స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,363 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా అభ్యర్థులకు ఎన్నికల్లో గెలిచినట్టు జిల్లాల్లో రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. 
► గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇచ్చాక, సదరు అభ్యర్థి అధికారికంగా గెలుపొందినట్టు లెక్క. గెలిచిన అభ్యర్థిని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు  ఉండదని నిబంధనలు చెబుతున్నాయి.
► గెలిచిన అభ్యర్థిని ఎన్నికల ట్రిబ్యునల్‌ ద్వారా లేక అనర్హత వేటు ద్వారా మాత్రమే ఆయా పదవుల నుంచి తొలగించవచ్చు.
► ఏవైనా బలమైన కారణాలు ఉంటే ఒకటి, రెండు చోట్ల ఎన్నికలను రద్దు చేసే అధికారం ఉండొచ్చు కానీ, జెడ్పీటీసీ సభ్యుల్లో 19 శాతం మంది, ఎంపీటీసీ సభ్యుల్లో 23 శాతం మంది గెలిచిన తర్వాత ఆ ఎన్నికలన్నింటినీ మూకుమ్మడిగా రద్దు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉండదు.
► ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఏకగ్రీవమైనవి కాకుండా మిగిలిన చోట్ల ఎన్నికలు రద్దు చేయాలంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. పోటీ చేసే అభ్యర్థులందరి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా ఏ నిర్ణయం తీసుకున్నా, అభ్యర్థులు కోర్టుకు వెళితే న్యాయం వారి వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.   

కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయి ఆంక్షలు
► రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడినప్పడు దేశంలోనే ఎక్కడా లాక్‌డౌన్‌ అమలు కాలేదు. మార్చి 15న ఎన్నికలను వాయిదా వేస్తే.. మార్చి 23వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దేశమంతటా అన్‌లాక్‌ కార్యక్రమం కొనసాగుతున్నా, కరోనా కేసులు నమోదవుతున్న కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. 
► అక్టోబర్‌ 22వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,244 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ జోన్ల పరిధిలో స్థానిక ఎన్నికలు జరపడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
► రాష్ట్రంలో 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పుడు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసి, ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలంటూ త్వరపడటం గమనార్హం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు