-

ఆ ఆశ్రమం..‘మమత’ల కోవెల 

22 Mar, 2023 12:20 IST|Sakshi
ప్రకృతి ఒడిలో అందంగా కనిపిస్తున్న ఆశ్రమం

ఎన్టీఆర్‌ జిల్లా లచ్చపాలెంలో వృద్ధాశ్రమం ఏర్పాటు 

ప్రకృతి ఒడిలో 50 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు 

ఆత్మీయుల ఆదరణ కరువైన వారిని అక్కునచేర్చుకున్న నిర్వాహకులు

నందిగామ(ఎన్టీఆర్‌ జిల్లా): కన్నబిడ్డలకు భారమై, ఆత్మీయుల ఆదరణకు దూరమై క్షణం ఒక యుగంలా గడుపుతున్న అవ్వాతాతలను అక్కున చేర్చుకుని ‘మమత’ను పంచుతోంది ఎన్టీఆర్‌ జిల్లా లచ్చపాలెంలోని వృద్ధాశ్రమం. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమం నడుస్తోంది. మలిదశలో ఉన్న వారి మనస్సుకు ప్రశాంతతను ఇస్తోంది. సేవే లక్ష్యంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత. ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయతలను పంచే వృద్ధాశ్రమంపై ప్రత్యేక కథనం.. 

సొంతూరుకు ఏదో చేయాలని.. 
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత ప్రస్తుతం హైదరాబాదులో బుక్‌ డిజైనింగ్‌ కంప్యూటర్‌ వర్క్‌ చేస్తుంటారు. ఆమె భర్త చక్రవర్తి వ్యాపారి. వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి సేవా దృక్పథం కలిగిన మమత హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాను పెరిగిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో లింగాలపాడు సమీపంలోని లచ్చపాలెం గ్రామంలో 2020 సంవత్సరంలో 50 సెంట్ల స్థలంలో సుమారు రూ.90 లక్షల వరకు వెచ్చించి  ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అభయం సొసైటీ ద్వారా పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ శేష సదన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో వృద్ధులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. సాయంత్రం వేళ ఆహ్లాదం కోసం పచ్చని గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో 22 మంది ఆశ్రయం పొందుతున్నారు.

నందిగామ ప్రాంత వాసుల సహకారం.. 
సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మమత తన దగ్గర ఉన్న నగదుతో పాటు మరో రూ.30 ల­క్ష­ల వరకు బ్యాంక్‌ ద్వారా రుణం తీసుకొని మొ­త్తం సుమారు రూ.90 లక్షలతో ఆశ్రమ నిర్మాణం పూ­ర్తి చేశారు. ఆమె ఆలోచనకు పలువురు దా­తలు సహకారం అందించారు. ఆశ్రమానికి తరచూ వచ్చి వెళుతూ వృద్ధుల బాగో­గులు చూసుకుంటున్నారు. నందిగామ చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఆశ్రమానికి మరింత అండగా నిలుస్తున్నారు. 

రెండేళ్ల నుంచి ఇక్కడే 
నా భర్త 30 ఏళ్ల కిందట చనిపోయాడు. ప్రస్తుతం నాకు 70 సంవత్సరాలు. పిల్లలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ నన్ను సొంత తల్లి లాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. 
–కన్నూరి రాజేశ్వరమ్మ, తిరువూరు  

మరింత  అభివృద్ధి చేయాలి 
చిన్నతనం నుంచి ఎదుటి వారికి సేవ చేయడమంటే ఇష్టం. ఈ ఉద్దేశంతోనే సొంత ఊరిలో ఆశ్రమం ఏర్పాటు చేశా. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి. ఆశ్రమంలో ఉండేవాళ్లు ప్రశాంతంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రకృతి ఒడిలో ఆశ్రమాన్ని నిర్మించాం. 
–వేముగంటి మమత, ఆశ్రమ నిర్వాహకురాలు  

మరిన్ని వార్తలు