నేపాలీకి వృద్ధాప్య పింఛన్‌

4 Jan, 2022 05:05 IST|Sakshi
నేపాలీ సాంబకు పింఛన్‌ అందిస్తున్న సర్పంచ్‌ గణేశ్వరరావు

పాతికేళ్లుగా విశాఖ జిల్లాలోనే ఉంటున్న వృద్ధుడు 

రావికమతం: అర్హుడైతే చాలు కులాలు చూడం, మతాలు చూడం అన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటలు.. విశాఖ జిల్లాలో అర్హుడైన నేపాల్‌ జాతీయునికీ మేలు చేశాయి. గ్రామ సర్పంచ్‌ చొరవతో సోమవారం అతనికి పింఛన్‌ అందింది. నేపాల్‌ జాతీయుడైన సాంబ అనే 61 ఏళ్ల వృద్ధుడు కాశ్మీర్‌లో ఉండేవాడు. విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామం నుంచి ఏటా పలువురు గ్రామస్తులు కూలి పనులకు కశ్మీర్‌ వెళ్తుంటారు. ఇక్కడి యువకులకు సాంబ అక్కడ పరిచయమై వీరిలో ఒక్కడిగా కలిసిపోయాడు. ఇది పాతికేళ్ల క్రితంనాటి మాట. అతనికి వివాహం కాలేదు.

ఏటా సంక్రాంతికి కూలీలు ఇక్కడికి వచ్చేటపుడు సాంబ కూడా వారితో వచ్చి ఇక్కడ యలంశెట్టి శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఉండేవాడు. వయస్సు మళ్లడంతో కొన్నేళ్లుగా కూలి పనులకు కశ్మీర్‌ వెళ్లడంలేదు. ఇక్కడే యలంశెట్టి వారింట్లో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటున్నాడు. సాంబకు యలంశెట్టి ఇంటి పేరుతో రేషన్‌ కార్డు మంజూరైంది. అయితే, వృద్ధాప్యంలో కూలికి వెళ్లని రోజున అతను పస్తులుండడంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన సర్పంచ్‌ గుమ్మాల గణేశ్వరరావు అతని దుస్థితికి చలించిపోయారు. అధికారులకు విషయం చెప్పి వృద్ధాప్య పింఛన్‌కు అతనితో దరఖాస్తు చేయించారు. ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేసింది. సర్పంచ్‌ గణేశ్వరరావుతోపాటు అధికారులు, గ్రామ నాయకులు అతనికి సోమవారం పింఛన్‌ అందించారు. దీంతో సాంబ ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వార్తలు