అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..

28 Dec, 2020 12:49 IST|Sakshi

చరిత్రలో పోలీసుకు ఓ ప్రత్యేక స్థానముంది. గ్రామాల్లో శాంతిభద్రతలకు సంబంధించి చిన్న సంఘటన జరిగినా ముందుగానే గుర్తుకు వచ్చేది పోలీసు. అందులోనూ చరిత్ర పుటల్లో పాతతరం పోలీసులకు ఉన్న గుర్తింపే వేరు. అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న పల్లెల్లో అప్పట్లో గొడవలు, ఘర్షణలు అధికం. నాడు ఫోన్లు కూడా లేని పరిస్థితుల్లో నేరుగా స్టేషన్‌కు వెళ్లి తమ ఆవేదనను పోలీసులకు చెప్పుకునేవారు. అలాంటి పోలీసులకు సంబంధించి 1900 తర్వాత లభించిన కొన్ని చారిత్రక లేఖలను.. ఎఫ్‌ఐఆర్‌.. కానిస్టేబుళ్లు ఎస్పీకి పెట్టుకున్న లేఖలు.. ఆనాడు పనిచేసిన  అధికారుల వివరాలతో కూడిన పాతతరం పత్రాలను జిల్లా పోలీసుశాఖ భద్రపరిచింది.

సాక్షి కడప:  జిల్లాలో కొన్ని గ్రామాలకు సంబంధించి చాలా సంవత్సరాల క్రితం పోలీసులు రాసిన పత్రాలతోపాటు గ్రామస్తుల నుంచి వచ్చిన లేఖలను పోలీసుశాఖ భద్రపరిచింది. అంతేకాకుండా అనేక రకాలైన గ్రామాల సమాచారం మొదలుకొని జిల్లా యంత్రాంగం అమలు చేసిన నిబంధనల పత్రాలు పాత బడి చినిగిపోతున్న నేపథ్యంలో భద్రతకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా పాతతరం లేఖలకు ల్యామినేషన్‌ చేయించి వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఒక ప్రత్యేక గదిలో వాటినన్నింటినీ ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉంచారు. నాడు పోలీసు డ్రస్, టోపీ, బెల్ట్, షూ ఎలా ఉండేది....ప్రస్తుతం ఎలా మార్పులు ఉన్నాయి.. హోంగార్డు మొదలుకొని డీజీపీ వరకు బొమ్మలను తయారు చేసి ఇతరులకు సులభ రీతిలో అర్థమయ్యేలా అమర్చారు.
 
నాటి ఆనవాళ్లు: ఎప్పుడో బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం వద్ద 1900 కాలంలో దిగిన పోలీసుల ఫొటోలతోపాటు రోషన్‌ అనే ఐపీఎస్‌ అధికారి ఫొటోను కూడా పోలీసులు సేకరించారు. అంతేకాకుండా 1955లో డీఎస్పీ వేసుకునే షర్టు, వాడిన టేబుల్, ఇన్‌లాండ్‌ లెటర్లు, 1938లో ముని వెంకటప్ప అనే కానిస్టేబుల్‌ సాధించిన కాండక్ట్‌ సరి్టఫికెట్, విలేజ్‌ హిస్టరీ సీడ్స్, 1939 నాటి స్టేషన్‌ రైటర్‌ వాడిన చెక్క పెట్టె, 1950 నాటి సీళ్లు, 1949 నాటి వాచ్‌ తదితర సామగ్రిని భద్రపరిచారు. ఇవన్నీ ప్రస్తుతం చరిత్రలో పోలీసుకు సాక్ష్యంగా నిలబడ్డాయి.

కొత్త డీపీఓ లైబ్రరీలో భద్రపరుస్తాం! 
జిల్లా కేంద్రమైన కడపలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేసి పాత తరం నాటి విలువైన వస్తువులను భద్ర పరుస్తాం. చరిత్రలో ఆనాటి వీరులను గుర్తుంచుకుంటాం. ఎన్నో ఏళ్ల కిందట తొలినాళ్లలో రాసిన లేఖలతోపాటు ఇతర ఫొటోలను తీపి గుర్తుగా భద్రపరుస్తాం. భావితరాలకు పోలీసు అంటే ఎలా ఉండేవారో తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. పాతకాలం నాటి ప్రతి వస్తువు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ భద్రపరుస్తున్నాం. త్వరలోనే వాటిని లైబ్రరీకి తరలించి ప్రత్యేక గదిలో అద్భుతంగా తీర్చిదిద్దుతాం.   – కేకేఎన్‌ అన్బురాజన్, జిల్లా ఎస్పీ   
 

>
మరిన్ని వార్తలు