చెక్కుచెదరని సౌధం

7 May, 2022 10:44 IST|Sakshi

లిఫ్టింగ్, షిఫ్టింగ్‌ జపాన్‌ టెక్నాలజీతో పాత ఇళ్లు పదిలం

పెద్ద పెద్ద నగరాల నుంచిగ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చిన టెక్నాలజీ

సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కలలకు ప్రతి రూపం. పట్టణాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతం అయింది. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో పూర్వం రోజుల్లో ఎంతో అపురూపంగా నిర్మించుకున్న ఇల్లు లోతట్టుగా మారింది. రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు, ఇతర కారణాలతో కొన్ని పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా లిఫ్టింగ్, షిఫ్టింగ్‌ జపాన్‌ టెక్నాలజీతో ఎన్నంతస్తుల భవనాలనైనా సునాయాసంగా అమాంతంగా ఎత్తేస్తున్నారు. ఈ టెక్నాలజీతో భవన యజమానులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. 

పొదలకూరు: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు జనావాసాలు పెరుగుతున్నాయి. అందుకునుగుణంగా రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నల్‌ రహదారులు ఎత్తుగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న కలల సౌదాలు లోతట్టులోకి మారిపోతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు ఒక ఎత్తైతే.. వాస్తుకు ఇది విరుద్ధంగా మారి ఆ ఇంటి యజమానులు కష్ట, నష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.  ఇలాంటి పరిణామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతతరం తీపి జ్ఞాపకాలతో ఉన్న ఇంటిని కూల్చేయాలంటే కొందరి మనస్సు అంగీకరించదు. మరి కొందరు తాత తండ్రులు నిర్మించిన ఇంటిని పదిలంగా చూసుకుంటారు. ప్రతి ఇటుక పెద్దల కష్టార్జితంతో పెట్టినట్టు భావించి పాత ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఉన్న ఇంటిని ధ్వంసం చేయాల్సి వస్తే తల్లడిల్లిపోతారు.

మూడు అడుగులు ఎత్తుకు.. 
పట్టణంలోని తొగటవీధిలో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నర్ల చిన్నపరెడ్డి ఇంటిని లిఫ్టింగ్‌ టెక్నాలజీతో మూడు అడుగుల ఎత్తు లేపుతున్నారు. బిల్డింగ్‌ లిఫ్టింగ్‌ అండ్‌ షిఫ్టింగ్‌ మొత్తం జాకీల సహాయంతోనే ఉంటుంది. లిఫ్టింగ్‌కు సాధార జాకీలు, షిఫ్టింగ్‌కు రన్నింగ్‌ జాకీలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందిన బిహార్‌కు చెందిన కూలీలు చేపడుతున్నారు. నర్ల చిన్నపరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి లిఫ్టింగ్‌ కంపెనీ వివరాలు తెలుసుకుని 30 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటి జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా రోడ్డుకు మూడు అడుగుల ఎత్తులో ఉండేలా లిఫ్టింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం కంపెనీకు రూ.3.80 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ కంపెనీ ఇంజినీరు పర్యవేక్షణలో పదిహేను రోజులుగా పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 1.5 అడుగుల మేర భవనాన్ని ఎత్తు లేపారు. మరో 1.5 అడుగుల ఎత్తు లేపాల్సి ఉందని వెల్లడించారు.  

టెక్నాలజీ సాయం.. భవనం పదిలం
లిఫ్టింగ్‌ అండ్‌ షిఫ్టింగ్‌ (భవనం ఎత్తు లేవపడం, పక్కకు జరపడం) టెక్నాలజీ ఇప్పుడు వారి కష్టాలను తొలగిస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో లిఫ్టింగ్‌ టెక్నాలజీ కొత్తమీ కాకున్నా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి రావడం విశేషం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంస్థ పాత ఇళ్లను చెక్కు చెదరకుండా ఇంటి యజమాని జ్ఞాపకాలను వారితోనే ఉంచే విధంగా పనిచేస్తోంది. పొదలకూరులో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆలోచనే లేని సమయంలో బిల్డింగ్‌ లిఫ్టింగ్‌ టెక్నాలజీని వినియోగించుకుని తమ పాత ఇంటిని ఎత్తు లేపుకుంటున్న వైనం పరిశీలిస్తే సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అర్థం అవుతుంది. 

లిఫ్టింగ్, షిఫ్టింగ్‌ సురక్షితం
భవనాల లిఫ్టింగ్, షిఫ్టింగ్‌ సురక్షితమని పనులు చేయించుకుంటున్న ఇంటి యజమానులు అంటున్నారు. ఈ టెక్నాలజీతో ఇప్పటికే చాలా చోట్ల బిల్డింగ్స్‌ను పైకి లేపడం, వాస్తురీత్యా పక్కకు జరపడం చేపట్టారు. వెంకటగిరి–ఏర్పేడు మార్గమధ్యంలో మల్లాం వద్ద హైవే రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భవనాన్ని 104 అడుగులు జరిపి మరో ప్లాటులో ఏర్పాటు చేసినట్టు లిఫ్టింగ్‌ ఇంజినీరు వెల్లడించారు. సుమారు 14 అడుగుల వరకు టెక్నాలజీతో భవనాలను ఎత్తు లేపవచ్చునంటున్నారు. ఒంగోలు, గూడూరుల్లో చాలా ఇళ్లను ఎత్తులేపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భవంతులు, దేవాలయాలను ఎత్తులేపడం, పక్కకు జరపడం పూర్తి చేశారు. షిఫ్టింగ్‌ టెక్నాలజీలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలుస్తోంది.  

పాత జ్ఞాపకాలు.. తక్కువ ఖర్చు 
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటి జ్ఞాపకాలు చెదరకుండా తక్కువ ఖర్చుతో భవనాన్ని లిఫ్టింగ్‌ చేస్తున్నారు. ఇదే ఇంటిని కూలదోసి అదే స్థలంలో నిర్మించాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. లిఫ్టింగ్‌ టెక్నాలజీతో ఇంటిని ఎత్తు లేపడంతో పాటు ఇతర రీ మోడలింగ్‌కు మరో రూ.10 లక్షల ఖర్చుతోనే పాత భవనాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చని లిఫ్టింగ్‌ ఇంజినీర్లు అంటున్నారు. గతేడాది శ్రీనివాసపురంలో చెన్నైకు చెందిన లిఫ్టింగ్‌ కంపెనీ పాత భవనాన్ని జాకీల సాయంతో ఎత్తు లేపింది.  

ఇంటిని కూల్చేందుకు ఇష్టం లేక 
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన మా ఇల్లు రోడ్లు అభివృద్ధి చెందడంతో లోతట్టుగా మారింది. అప్పటి పరిస్థితుల్లో ఎత్తులోనే నిర్మించుకున్నా.. ఇల్లు లోతట్టుగా మారడంతో వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో ఇళ్లు కూల్చి కట్టడం తప్పనిసరి. అయితే పాత ఇల్లు కూల్చేందుకు ఇష్టం లేక లిఫ్టింగ్‌ టెక్నాలజీతో భవనాన్ని ఎత్తు లేపుకుంటున్నాం. చాలా చోట్ల విచారించే ఈ సాహసానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో కొత్త అయినప్పటికీ సలహాలు తీసుకుని పెద్దలను ఒప్పంచి పనులు చేయిస్తున్నాం. ఈ విధానం వల్ల చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది.  
– నర్ల శ్రీనివాసులురెడ్డి, 
ఇంటి యజమాని, పొదలకూరు 

ఖర్చు తక్కువతో సమస్యకు పరిష్కారం 
భవనాన్ని చెక్కు చెదరకుండా లిఫ్టింగ్‌ అండ్‌ షిఫ్టింగ్‌ పనులు చేపడతాం. ఏ డేళ్లుగా ఈ రంగంలో ఇంజినీరుగా కొనసాగుతూ సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం. కూలీలకు సైతం శిక్షణ ఇచ్చి జాగ్రత్తలు పాటిస్తూ లిఫ్టింగ్‌ పనులు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరిక లేనంతగా పనులు ఉన్నాయి. జనం నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న మెటీరియల్, కూలీల ఖర్చులతో కొత్తగా భవనం నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ టెక్నాలజీలతో చాలా తక్కువలో ఇంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  
– ఎస్‌.అనిల్‌కుమార్, ఇంజినీరు 

మరిన్ని వార్తలు